చంద్రనాథ్ హత్యకు పక్కా ప్లాన్.. మూడు రోజుల క్రితమే రెక్కీ?

Chandra Nath Rath Murder Case Rocks West Bengal Politics
  • బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో చంద్రనాథ్ హత్య
  • వ్యూహాత్మకంగా ఆయన కారును అడ్డగించిన మరో కారు
  • ఆపై బైక్‌పై వచ్చిన దుండగుల కాల్పులు
  • మహా జంగిల్ రాజ్‌కు ఇది పరాకాష్ట అన్న సువేందు
  • టీఎంసీ గూండాలను ఏరివేసేంత వరకు విశ్రమించమని శపథం
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి నెత్తురోడాయి. బీజేపీ ఫైర్‌బ్రాండ్ సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ (41) అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి నార్త్ 24 పరగణాల జిల్లాలో దుండగులు ఆయనపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపి హతమార్చారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదని, రెండు మూడు రోజులుగా రెక్కీ నిర్వహించి, పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని సువేందు అధికారి సంచలన ఆరోపణలు చేయడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపింది.

అసలేం జరిగింది?
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో చంద్రనాథ్ రథ్ తన స్కార్పియో వాహనంలో మధ్యమ్‌గ్రామ్‌లోని తన ఇంటికి బయలుదేరారు. డోల్తాలా ప్రాంతంలోకి రాగానే, వ్యూహాత్మకంగా ఓ చిన్న కారు (నిస్సాన్ మైక్రా) ఆయన వాహనాన్ని అడ్డగించింది. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు, రథ్ కూర్చున్న డ్రైవర్ పక్క సీటు వద్దకు వచ్చి, కారు అద్దం పైనుంచే అతి సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరిపారు. ఛాతీ, పొత్తికడుపులో బుల్లెట్లు దిగడంతో రథ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. దుండగులు దాడికి వాడిన కారును అక్కడే వదిలేసి, బైక్‌పై పరారయ్యారు.

ఇది ప్రణాళికతో చేసిన హత్యే: సువేందు అధికారి
తన సహాయకుడి హత్యపై సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. ఇది తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గూండాల పనేనని ఆయన ఆరోపించారు. "ఇది ముమ్మాటికీ ప్రణాళికతో చేసిన హత్య. రెండు మూడు రోజులుగా చంద్రనాథ్‌పై రెక్కీ నిర్వహించి, సమయం చూసి దాడి చేశారు. రాష్ట్రంలో 15 ఏళ్లుగా సాగుతున్న 'మహా-జంగిల్ రాజ్'కు ఇది పరాకాష్ట. ఈ హత్య వెనుక ఉన్న టీఎంసీ గూండాలను ఏరివేసేంత వరకు బీజేపీ విశ్రమించదు" అని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర డీజీపీ తనకు ఫోన్ చేసి నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.

నకిలీ నంబర్ ప్లేట్.. రాజకీయ కుట్ర కోణం
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, దాడికి ఉపయోగించిన నిస్సాన్ మైక్రా కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ కారుకు అమర్చిన నంబర్ ప్లేట్ నకిలీదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇది హత్య వెనుక పెద్ద కుట్ర ఉందన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. "కీలక నేత సహాయకుడిని లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం ద్వారా రాజకీయంగా ఒక భయానక సందేశం పంపాలని చూస్తున్నారు. బెంగాల్‌లో నేరపూరిత రాజకీయ వాతావరణం ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన తెలియజేస్తోంది" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య విమర్శించారు. ప్రస్తుతం పోలీసులు హత్య కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. 
Go Back to Shorts
Chandra Nath Rath
Suvendu Adhikari
West Bengal Politics
North 24 Parganas
TMC
BJP
Political Murder
Crime
Bengal Crime
Political Violence

More Telugu News