రాజీనామా చేయనంటున్న మమత.. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఈసీ నోటిఫికేషన్
- కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించిన ఈసీ
- రాష్ట్రంలో అధికారికంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ
- మే 9న ప్రమాణస్వీకారం చేయాలనుకుంటున్న బీజేపీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజ్యాంగపరమైన ప్రక్రియలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో కొత్త శాసనసభ ఏర్పాటుకు సంబంధించి భారత ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను అధికారులు గవర్నర్‌కు సమర్పించడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసినట్లయింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా గవర్నర్ వద్దకు చేరడంతో, మెజారిటీ సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే మార్గం సుగమమైంది.
మరోవైపు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అయితే ఈసీ తాజాగా విడుదల చేసిన 'కాన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూ అసెంబ్లీ' నోటిఫికేషన్ ఆమెకు ఊహించని షాక్‌గా మారింది. ఇప్పటికే మే 9వ తేదీన నూతన ప్రభుత్వం కొలువుదీరాలని బీజేపీ భావిస్తున్న తరుణంలో, ఈ నోటిఫికేషన్ విడుదల కావడం ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అమిత్ షా వంటి అగ్రనేతల పర్యవేక్షణలో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.