అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. ఉత్కంఠ రేపుతున్న ట్రెండ్స్

Assembly Elections 2024 Trends Exciting Results
  • పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీ
  • కేరళలో ఆధిక్యంలో యూడీఎఫ్  
  • తమిళనాడులో డీఎంకే, అస్సాంలో బీజేపీ ముందంజ
కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోంతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ వెలువడుతున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. మధ్యాహ్నం నాటికి ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించగా, ప్రారంభ ట్రెండ్స్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) వెనుకంజలో ఉంది. రాష్ట్రంలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ కూటముల మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని 294 స్థానాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. వరుసగా నాలుగోసారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, ఈసారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయాలని బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. అసోంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండగా, పుదుచ్చేరిలోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది.

వీటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని ఏడు స్థానాలకు ఉప ఎన్నికల కౌంటింగ్ కూడా జరుగుతోంది. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మహారాష్ట్రలోని బారామతి స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికపై అందరి దృష్టి ఉంది. ఇక్కడ దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీ చేస్తున్నారు. ఆమె గెలుపు తన పదవిని నిలబెట్టుకోవడానికి రాజ్యాంగపరంగా కీలకం.

ఇప్పటి వరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం..
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ 108, బీజేపీ 119 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తమిళనాడులో డీఎంకే 72,  అన్నాడీఎంకే 33, విజయ్ పార్టీ టీవీకే 53 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అసోంలో బీజేపీ 63, కాంగ్రెస్ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కేరళలో ఎల్డీఎఫ్ 15, యూడీఎఫ్ 50 స్థానాల్లో, పుదుచ్చేరిలో బీజేపీ 2, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
Go Back to Shorts
Assembly Elections 2024
Kerala
West Bengal
Tamil Nadu
Assam
Puducherry
Election Results
TMC
BJP
LDF UDF

More Telugu News