బ్లాక్ మార్కెట్ చేసే వాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కయింది: అవినాశ్ రెడ్డి

AP govt committed with black marketers says YS Avinash Reddy
  • కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శిని కలిసిన అవినాశ్ రెడ్డి
  • రాష్ట్రంలో 70 శాతం పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాయని వెల్లడి
  • రైతులు, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన

ఏపీలో కొనసాగుతున్న ఇంధన సంక్షోభంపై వైసీపీ తన పోరాటాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లింది. పార్టీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈరోజు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్‌ను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో సుమారు 70 శాతం పెట్రోల్ బంకులు 'నో స్టాక్' బోర్డులు పెట్టాయని, బైక్‌లకు కూడా రూ. 200 కంటే ఎక్కువ పెట్రోల్ పోయని దుస్థితి నెలకొందని ఆయన కేంద్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.


అనంతరం మీడియాతో మాట్లాడిన అవినాశ్ రెడ్డి, ప్రజల కష్టాలను తీర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే బ్లాక్ మార్కెట్ చేసే వారితో కుమ్మక్కయిందని సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రబీ కోతల సమయంలో డీజిల్ దొరకక రైతులు, ఏరియేటర్లు నడవక ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమర్షియల్ ఎల్పీజీ ధరలు పెరిగినా బ్లాక్ మార్కెటింగ్ ఆగడం లేదని, ఆయిల్ కంపెనీలు సరఫరాను తగ్గించడం వెనుక ఉన్న ఉద్దేశపూర్వక చర్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఏపీకి అవసరమైన ఇంధన నిల్వలను పంపి, పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement
YS Avinash Reddy
YSRCP

More Telugu News