ఐపీఎల్ అభివృద్ధి అద్భుతం.. ఎన్‌బీఏ, ప్రీమియర్ లీగ్‌లతో సమానం: సౌరవ్ గంగూలీ

Sourav Ganguly Amazed by IPL Brand Value Growth
  • ఐపీఎల్ ఎదుగుదల అద్భుతమన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
  • ప్రసార హక్కుల్లో ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌లతో సమానమన్న దాదా
  • రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని 15,286 కోట్లకు కొనుగోలు 
  • అమెరికాకు చెందిన వ్యాపారవేత్తల కన్సార్టియం చేతికి ఆర్ఆర్‌
  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ విలువ 16,000 కోట్లకు పైమాటే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బ్రాండ్ విలువ ఆకాశాన్నంటుతోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీని ఏకంగా 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15,286 కోట్లు) కొనుగోలు చేయడంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం, హర్షం వ్యక్తం చేశాడు. కేవలం రెండు, మూడు నెలలు జరిగే లీగ్‌కు ఈ స్థాయి విలువ రావడం అద్భుతమని ఆయన అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ ఇప్పుడు ప్రపంచంలోని దిగ్గజ స్పోర్ట్స్ లీగ్‌లైన నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ), ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్‌) సరసన నిలిచిందని ప్రశంసించాడు.

తాజాగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం సొంతం చేసుకుంది. వాల్‌మార్ట్ కుటుంబానికి చెందిన రాబ్ వాల్టన్, ఫోర్డ్ మోటార్ కంపెనీలో భాగస్వాములైన హ్యాంప్ కుటుంబం ఈ కన్సార్టియంలో భాగస్వాములుగా ఉన్నారు. ఇదే క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీని 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 16,000 కోట్లకు పైగా) అమ్ముడ‌యింది.

ఈ పరిణామాలపై ఎన్డీటీవీ అడిగిన ప్రశ్నకు గంగూలీ స్పందిస్తూ... "2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో మొదటి బంతిని నేనే ఎదుర్కొన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్ ఎదిగిన తీరు అసాధారణం. ఇది భారత క్రికెట్ ఎంతగా విస్తరించిందో చూపిస్తోంది. అమెరికా నుంచి కొనుగోలుదారులు రావడం, ప్రపంచవ్యాప్తంగా భారత క్రికెట్‌పై ఆసక్తి పెరగడం గొప్ప విషయం" అని అన్నాడు.

"ప్రసార హక్కుల విషయంలో ఐపీఎల్ ప్రపంచంలోని ఏ లీగ్‌కు తీసిపోదు. కొన్నిసార్లు ఈపీఎల్ మ్యాచ్ కంటే ఐపీఎల్ మ్యాచ్ ప్రసార హక్కుల విలువే ఎక్కువగా ఉంటోంది. సంవత్సరంలో కేవలం రెండున్నర, మూడు నెలలు మాత్రమే ఆడే ఒక స్పోర్ట్స్ ఫ్రాంచైజీకి ఇంత భారీ మొత్తంలో విలువ ఉండటం ఊహకు అందని విషయం" అని గంగూలీ తెలిపాడు. ఈ రికార్డు స్థాయి ఒప్పందాలు ఐపీఎల్‌ను ప్రపంచ క్రీడా వేదికపై ఒక శక్తివంతమైన లీగ్‌గా నిలబెట్టాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Sourav Ganguly
IPL
Indian Premier League
Rajasthan Royals
NBA
EPL
sports franchise value
cricket business
RCB sale
sports league

More Telugu News