Nimmala Ramanayudu: వెలిగొండ ప్రాజెక్టు అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం

Nimmala Ramanayudu Angered Over Veligonda Project Officials
షార్ట్స్‌లో చూడండి
ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను శరవేగంతో పూర్తి చేసి, ప్రజలకు ఫలితాలు అందించడమే లక్ష్యమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఈ విషయంలో జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులను, కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆయన గట్టిగా హెచ్చరించారు. మంగళవారం వెలిగొండ ప్రాజెక్ట్, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై ఆయన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ లైనింగ్ పనులు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జరగకపోవడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రతివారం సమీక్ష జరుపుతుంటే ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటామని చెప్పడంలో అర్థం లేదు. జాప్యానికి కారణమైన వారు అమరావతి వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది' అని హెచ్చరించారు. అధికారులందరూ సంయుక్త బాధ్యతతో పనిచేస్తేనే ప్రజలకు ఇచ్చిన మాట నిలబడుతుందని ఆయన అన్నారు.

పోలవరం, హంద్రీనీవా తర్వాత వెలిగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ఈ సీజన్ ప్రారంభమయ్యేలోగా గోదావరి జలాలను అనకాపల్లి వరకు తీసుకెళ్లేలా పోలవరం ఎడమ కాలువ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జూన్ నాటికి నల్లమల సాగర్‌ను నింపేలా వెలిగొండ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి వారం సీఎంకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. నిర్వాసితులకు త్వరలోనే పునరావాస పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
 
Go Back to Shorts
Nimmala Ramanayudu
Veligonda Project
Polavaram Left Canal
Irrigation Projects
Andhra Pradesh
Chandrababu Naidu
Water Resources
Irrigation Department
Nellore
Anakapalli

More Telugu News