Shailajanath: ఆర్డీటీ విదేశీ నిధుల పునరుద్ధరణ వైసీపీ పోరాట ఫలితమే.. టీడీపీది క్రెడిట్ చోరీ: శైలజానాథ్
రాయలసీమ ప్రాంతంలో పేదల పాలిట కల్పవృక్షంగా ఉన్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT)కు విదేశీ నిధుల అనుమతులు (FCRA) మళ్లీ లభించడంపై వైసీపీ స్పందించింది. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ... ఈ విజయం వైసీపీ కార్యకర్తలు, ప్రజల పోరాట ఫలితమని స్పష్టం చేశారు. 2025 ఏప్రిల్ లో కేంద్రం ఈ నిధులను నిలిపివేసినప్పటి నుంచి తమ పార్టీ నాయకులు అలుపెరగని పోరాటం చేశారని ఆయన గుర్తుచేశారు.
అయితే, ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రయత్నిస్తున్నారని, వారి 'క్రెడిట్ చోరీ'ని చూసి జనం నవ్వుకుంటున్నారని శైలజానాథ్ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఆర్డీటీ నిధులు నిలిచిపోయాయని, అప్పటి నుంచి టీడీపీ నేతలు ఎక్కడైనా ఒక్క పోరాటమైనా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో వైసీపీ నాయకుల పాత్ర కీలకమని ఆయన వివరించారు.
ముఖ్యంగా కల్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తలారి రంగయ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షాను స్వయంగా కలిసి వినతి పత్రం అందించారని, అలాగే లక్ష పోస్టు కార్డుల ఉద్యమం నుంచి పార్లమెంటులో నిరసనల వరకు తాము అనేక రూపాల్లో ఒత్తిడి తీసుకొచ్చామని శైలజానాథ్ పేర్కొన్నారు. తాము చేసిన కష్టాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు తమదిగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. ఆర్డీటీ సేవలు మళ్లీ ప్రారంభం కావడం శుభపరిణామమని అన్నారు.