అనకాపల్లి జిల్లాలో నక్కపల్లికి అర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ రావడానికి అసలు కారణం వైసీపీ అధినేత జగన్ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్తో జగన్ జరిపిన చర్చల ఫలితంగానే ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కిందని గుర్తుచేశారు. ఆదిత్య మిట్టల్ కోరిన విధంగానే నక్కపల్లి వద్ద 4 వేల ఎకరాల భూమిని చూపించామని, ఎన్నికల నోటిఫికేషన్ సమయంలోనే దీనిపై స్పష్టత వచ్చిందని ఆయన వివరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కొత్తగా వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. జగన్ హయాంలో వచ్చిన బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం ఇప్పటికీ పూర్తి చేయలేకపోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు. 35 వేల మందికి ఉపాధి కల్పించాల్సిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అయోమయంలో పడిందని, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. గడిచిన కాలంలో సుమారు రూ. 6,500 కోట్ల పెట్టుబడులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని ఆయన ఆరోపించారు.
ఇదే క్రమంలో వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణలపై అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. "మీ రాజకీయ అవసరాల కోసం జగన్ వ్యక్తిత్వాన్ని కించపరచకండి. ఎవరి చేతిలోనూ రాజకీయ పావుగా మారకండి" అని హితవు పలికారు. షర్మిల వ్యాఖ్యల వల్ల వైసీపీ కార్యకర్తల నుంచి తమపై ఒత్తిడి పెరుగుతోందని, ఇప్పటివరకు జగన్ తమను కట్టడి చేస్తున్నారని చెప్పారు. ఒకవేళ హద్దు మీరితే మాత్రం మిగతా రాజకీయ పార్టీ నాయకులకు ఎలా సమాధానం చెబుతామో, ఆమెకు కూడా అలాగే బదులిస్తామని హెచ్చరించారు.