Chandrababu Naidu: గ్యాస్ సంక్షోభానికి చెక్... ఎల్పీజీకి బదులు పీఎన్జీ!: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu Naidu Focuses on PNG as Alternative to LPG in Andhra Pradesh
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో నెలకొన్న సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంపై దృష్టి సారించడమే సరైన మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి ఇంటికీ పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్ అందించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్పీజీ సరఫరా, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, టెక్నాలజీ వినియోగం వంటి అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్యాస్ సంక్షోభాన్ని విద్యుత్ రంగానికి ఒక అవకాశంగా మలుచుకోవాలని, ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వంటి వాటి వాడకాన్ని ప్రజల్లో ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో పీఎన్జీ విస్తరణకు 2.34 లక్షల కనెక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం 60 వేల మంది మాత్రమే వినియోగించుకుంటున్నారని అధికారులు వివరించగా.. దీనిని 100 శాతం వినియోగంలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ప్రతి జిల్లాలో కనీసం 10 వేల కొత్త పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చేలా లక్ష్యం నిర్దేశించారు.

 నిలిచిపోయిన శ్రీకాకుళం - కాకినాడ పైప్‌లైన్ పునరుద్ధరణ కోసం కేంద్ర మంత్రికి తక్షణమే లేఖ రాయాలని చెప్పారు. ఏపీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌కు అవసరమైన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలన్నారు. వాణిజ్య రంగంలో సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ‘నేచురల్ గ్యాస్ పాలసీ’ని వచ్చే కేబినెట్ సమావేశం ముందుకు తీసుకురావాలని స్పష్టం చేశారు. విద్యా సంస్థలు, ఆస్పత్రులు, అంగన్‌వాడీలు, అన్న క్యాంటీన్లు, హోటళ్లకు ప్రాధాన్యతా క్రమంలో ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేయాలన్నారు. గత ఐదు రోజులుగా గృహావసరాలకు రోజుకు సగటున 1.80 లక్షల సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని, మరో 14,444 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు.

పంట నష్టంపై మార్చి 26లోగా నివేదిక
అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన పంట నష్టంపై ప్రాథమిక వివరాలను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 26వ తేదీలోగా పంట నష్టంపై పూర్తిస్థాయి అంచనాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంలో జీఎస్‌డీపీ 40 శాతం, ఉత్పాదన 71 శాతం పెరిగిన నేపథ్యంలో పంటల నిర్వహణ, పంటల మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

పాలనలో టెక్నాలజీ వినియోగంపై ప్రశంస
టెక్నాలజీ వినియోగంతో అన్ని రంగాల్లో అద్భుత ఫలితాలు సాధించవచ్చని, దీనికి తిరుమలలో పెరిగిన దర్శనాల సంఖ్యే నిదర్శనమని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో తిరుమలలో క్యూలైన్ల నిర్వహణ మెరుగుపడిందని, భక్తుల నిరీక్షణ సమయం తగ్గి దాదాపు 20 శాతం అదనపు దర్శనాలు సాధ్యమయ్యాయని వివరించారు. 

అత్యాధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటుతో ప్రసాదం నాణ్యత పెరిగిందని, భక్తులు, శ్రీవారి సేవకుల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని అన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన శాఖలు కూడా మెరుగైన ప్రజా సేవల కోసం ఏఐ ఇంటిగ్రేషన్‌పై దృష్టి సారించాలని ఆదేశించారు. 

ఐఓటీ పరికరాలు, సెన్సార్లు, సీసీటీవీల ద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో సాగు వ్యయం తగ్గించి, ఉత్పత్తి పెంచేలా చూడాలని, ఇందుకు పొరుగు రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో బ్యాండ్ విడ్త్ పెంచాలని, ప్రభుత్వ శాఖలు డేటాను సమర్థంగా వినియోగించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
PNG
LPG crisis
Natural gas policy
Crop damage
Technology usage
AP city gas distribution network
Induction stoves
Electric cookers

More Telugu News