Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ

Revanth Reddy Faces Open Letter from Harish Rao Over Siddipet Funds
షార్ట్స్‌లో చూడండి
సిద్దిపేట అభివృద్ధికి నిధులు రద్దు చేశారని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. రేపు సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈనేపథ్యంలో ఆయన పలు ప్రశ్నలతో బహిరంగ లేఖ రాశారు.

సిద్దిపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం తాము చేస్తే శిలాఫలకం మీది ఎందుకని ప్రశ్నించారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రావడానికికంటే ముందు జిల్లాకు రద్దు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.1,070 కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సగం మంది రైతులకు రుణమాఫీ జరగలేదని, మూడుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 27 నెలల తర్వాత సిద్దిపేటకు వస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం లేదన్నట్లుగా ఇన్నాళ్లు వ్యవహరించారని విమర్శించారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం పేరిట సిద్దిపేటలో అడుగుపెడుతున్న ముఖ్యమంత్రికి తాను పలు ప్రశ్నలు సంధించదలుచుకున్నానని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిఫలమే ఈ పామాయిల్ ఫ్యాక్టరీ అని పేర్కొన్నారు. కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ వాళ్లు కూలేశ్వరంగా అభివర్ణించారని మండిపడ్డారు. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన కృషి ఫలితమే అన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు, పామాయిల్ తోటల సాగులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శించారు. 2021 జూన్ 5న తొలి పామాయిల్ మొక్కను నాటింది తానేనని వెల్లడించారు.

2022 జనవరి 12వ తేదీన 62 ఎకరాల భూమి కేటాయించి, మార్చి 4న భూమికి ఫెన్సింగ్ పనులు మరియు స్టోరేజ్ వాటర్ రిజర్వాయర్‌ను ప్రారంభించామని తెలిపారు 2023 ఏప్రిల్ 4న ఫ్యాక్టరీకి పునాదిరాయి వేసి పనులు ప్రారంభించామని అన్నారు. పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాత్ర కొండంత అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం పాత్ర గోరంత కూడా లేదని అన్నారు.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.1,070 కోట్ల నిధులను అర్ధాంతరంగా రద్దు చేశారని ఆరోపించారు. నిధులను రద్దు చేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు అధికారిక పర్యటన చేస్తున్నందున, ఆ నిధులన్నీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో 22 వేల మందికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. రూ.170 కోట్ల మేర రైతు భరోసా నిధులు రాలేదని, వాటిని రేపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ హయాంలో మంజూరై, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రద్దయి ఆగిపోయిన పనుల జాబితాను ఆయన పేర్కొన్నారు. రంగనాయకసాగర్‌ టూరిజం,  కోమటిచెరువు శిల్పారామం, సిద్దిపేట నియోజకవర్గ ఔటర్‌ రింగు రోడ్డు, తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్‌ కళాశాల, మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం, సిద్దిపేటలో క్రీడాకారుల కోసం స్పొర్ట్స్‌ హబ్‌, టు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ భవనం, త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ భవనం, సిద్దిపేట-ఇల్లంతకుంట ఫోర్‌లేన్‌ రోడ్డు, – సిద్దిపేట-కిష్టాపూర్‌ రహదారి, సిద్దిపేటలో మల్టీపర్పస్‌ ఆడిటోరియం, సిద్దిపేట బ్లాక్ ఆఫీస్‌ సమీపంలో ఇంటిగ్రేటెడ్‌ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ ఆగిపోయాయని అన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Harish Rao
Siddipet
Telangana
BRS
Oil Palm Factory
Farmer Loan Waiver
Rythu Bharosa

More Telugu News