Virat Kohli: ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు.. 120 శాతం కష్టపడాలి: సహచరులకు కోహ్లీ పిలుపు

Virat Kohlis Call to RCB Teammates Ahead of IPL 2026
షార్ట్స్‌లో చూడండి
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీ ఈ నెల‌ 28న ప్రారంభం కానుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్లు తలపడనున్నాయి. గతేడాది తమ తొలి టైటిల్ గెలిచిన ఆర్‌సీబీ, ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కీలక పోరుకు ముందే ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు, భారత బ్యాటింగ్ ఐకాన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్‌లో అతడు ఆడుతున్న పవర్‌ఫుల్ షాట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గత మూడు సీజన్లలోనూ 600కు పైగా పరుగులు సాధించిన కోహ్లీ, ఈసారి కూడా జట్టుకు కీలకం కానున్నాడు. 

ఈ సందర్భంగా సహచరులలో స్ఫూర్తి నింపుతూ కోహ్లీ మాట్లాడాడు. "గతేడాది మనం సాధించిన విజయం కోసం గత రెండు, మూడు సీజన్లుగా చాలా కష్టపడ్డాం. ఈసారి ఇతర జట్లు మనపై గట్టిగా పోరాడతాయి కాబట్టి పోటీ మరింత కఠినంగా ఉంటుంది. ఈ సమయాన్ని వృథా చేయొద్దు. ప్రతీ సెషన్‌లోనూ ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా 120 శాతం కష్టపడాలి. ఛాలెంజర్లుగా బరిలోకి దిగేందుకు మనమంతా ఉత్సాహంగా ఉన్నామని అందరి ముఖాల్లో కనిపిస్తోంది" అని కోహ్లీ తన సహచరులకు పిలుపునిచ్చాడు.

2025లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఆరు పరుగుల తేడాతో ఓడించి ఆర్‌సీబీ తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ స్పందించాడు. "వేలం ఆసక్తికరంగా సాగింది. మా స్క్వాడ్‌ను మరింత మెరుగుపరుచుకున్నామని చెప్పగలను. జట్టులోకి కొందరు ఆటగాళ్లు వచ్చారు. విరాట్, రజత్ వంటి సీనియర్లతో పాటు కొత్త ఆటగాళ్లను జట్టులో కలపడం ద్వారా కొత్త జట్టును నిర్మించడం ఉత్సాహంగా ఉంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

రికార్డుపై కన్నేసిన కోహ్లీ
ఇప్పటివరకు 267 మ్యాచ్‌లలో 8 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలతో మొత్తం 8,661 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఈ సీజన్‌లో మరో అరుదైన మైలురాయిపై కన్నేశాడు. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచేందుకు అతను అడుగు దూరంలో ఉన్నాడు.
Go Back to Shorts
Virat Kohli
RCB
Royal Challengers Bangalore
IPL 2026
Indian Premier League
Cricket
M Chinnaswamy Stadium
Sunrisers Hyderabad
Andy Flower

More Telugu News