Narayana Minister: అమరావతి గ్రామాల్లో సౌకర్యాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

Narayana Minister Announces Key Plans for Amaravati Village Amenities

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాజధాని గ్రామాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి పరిధిలోని అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి ఈరోజు నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టమైన హామీ ఇచ్చారు.


రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ కంఠాల బయట ఏ తరహా అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయో, గ్రామాల్లో కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి వివరించారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టార్మ్ వాటర్ వ్యవస్థ, ఎల్‌ఈడీ వీధి దీపాలు, నాణ్యమైన సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడతామని... పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనుల్లో సుమారు 30,000 మంది కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.


రాజధాని నిర్మాణ గడువులపై కూడా నారాయణ కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల నివాస భవనాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే, 2027 జూన్ నాటికి 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇక అమరావతికి తలమానికంగా నిలిచే ఐకానిక్ భవనాలు 2028 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని వివరించారు. నిన్ననే ఉండవల్లి వద్ద స్టీల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన మంత్రి, నేడు నేరుగా గ్రామాల్లో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించడం విశేషం.

Narayana Minister
Amaravati
Andhra Pradesh Capital
CRDA
Infrastructure Development
Village Development
MLA Sravan Kumar
New Capital City
AP Assembly Buildings
Real Estate Amaravati

More Telugu News