Software Engineer: నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల ప్యాకేజీ.. టెక్కీ సక్సెస్ స్టోరీ!

Software Engineer Achieves Rs 65 Lakh Package in 4 Years
  • కుటుంబ అప్పులు తీర్చేందుకే తీవ్రంగా శ్రమించానని వెల్లడి
  • ప్రారంభంలో నిర్లక్ష్యం... ఆ తర్వాత లక్ష్యం కోసం తీవ్రమైన కృషి
  • ప్రముఖ కంపెనీల నుంచి ఆఫర్లు... చివరికి భారీ ప్యాకేజీకి ఓకే
  • టెక్కీ విజయగాథ సోషల్ మీడియాలో యువతకు స్ఫూర్తిదాయకం
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయగాథ ఇప్పుడు సోషల్ మీడియాలో యువతకు స్ఫూర్తినిస్తోంది. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో తన వార్షిక వేతనాన్ని రూ. 3.5 లక్షల నుంచి ఏకంగా రూ. 65 లక్షలకు పెంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, అప్పుల్లో ఉన్న తన తల్లిదండ్రులను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయడానికే ఈ స్థాయికి చేరుకున్నానని అతను చెప్పడం పలువురిని కదిలిస్తోంది.

రెడిట్ సోషల్ మీడియా వేదికగా తన ప్రయాణాన్ని వివరిస్తూ, 2021లో కాగ్నిజెంట్ కంపెనీ నిర్వహించిన మాస్ రిక్రూట్‌మెంట్‌లో రూ. 3.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగంలో చేరానని ఆ టెక్కీ తెలిపాడు. అప్పుడు తన చేతికి నెలకు రూ. 26,000 మాత్రమే వచ్చేదని చెప్పాడు. "నిజం చెప్పాలంటే, ఉద్యోగం కోసం నేను పెద్దగా ప్రయత్నించలేదు. వాళ్లే తీసుకున్నారు. మొదటి కొన్ని నెలలు పని చేయకుండా సినిమాలు, యానిమేషన్ చూస్తూ సమయం గడిపేశాను" అని అతను నిజాయతీగా అంగీకరించాడు.

అయితే, తన జీతంతో కుటుంబ అప్పులు, వాటిపై వడ్డీలు కూడా కట్టలేమని గ్రహించాక తనలో మార్పు వచ్చిందని చెప్పాడు. "ఐటీ రంగంలో ఉన్న నాకు గణితం, లాజిక్‌లో పట్టు ఉందని తెలుసు. దీంతో ఎంత దూరం వెళ్లగలనో చూడాలనుకున్నా. లక్షల్లో సంపాదిస్తున్న వారిని చూసి, అదే నా మార్గమని నిర్ణయించుకున్నా. అప్పులన్నీ తీర్చేసి, ఆర్థికంగా స్థిరపడటమే నా లక్ష్యమైంది" అని పేర్కొన్నాడు.

అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. 2023లో 45 శాతం, 2024లో 28 శాతం జీతం పెంపు సాధించాడు. ఆ తర్వాత 2024 మధ్యలో రూ. 19 లక్షల ప్యాకేజీతో మరో కంపెనీలో చేరాడు. అక్కడితో ఆగకుండా మరింత ఉన్నత స్థాయికి చేరాలని తీవ్రంగా శ్రమించాడు. "వారాంతాలు, విహారయాత్రలు లేకుండా కష్టపడ్డాను. మొదట్లో కొన్ని సులభమైన ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయినా పట్టు వదల్లేదు" అని వివరించాడు.

అతని కృషి ఫలించి సర్వీస్‌నౌ, పేపాల్, సిస్కో వంటి అగ్రశ్రేణి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చాయి. చివరికి ఓ టాప్ ప్రాడక్ట్ కంపెనీ ఇచ్చిన రూ. 65 లక్షల ఆఫర్‌ను స్వీకరించాడు. "నా తల్లిదండ్రుల ముఖంలో ఆనందం చూస్తున్నాను. నన్ను కార్పొరేట్ బానిస అననీ, ఇంకేమైనా అననీ.. నేను పట్టించుకోను. ఒకప్పుడు ఊహించనివి ఇప్పుడు సాధించగలుగుతున్నాను" అని భావోద్వేగంగా రాసుకొచ్చాడు.

ఈ పోస్ట్ వైరల్ కావ‌డంతో నెటిజన్లు అతడిని 'పీక్ మోటివేషన్' అంటూ ప్రశంసిస్తున్నారు. అతని ప్రిపరేషన్ ప్లాన్ చెప్పమని చాలా మంది కోరుతుండగా, మరికొందరు అభినందనలు తెలుపుతున్నారు. మొత్తం మీద ఈ టెక్కీ కథ ఐటీ రంగంలోని ఎంతో మంది యువతకు కష్టపడితే ఏదైనా సాధించవచ్చనే నమ్మకాన్ని కలిగిస్తోంది.
Software Engineer
Techie Success Story
Cognizant
Salary Hike
IT Career
ServiceNow
PayPal
Cisco
Job Interview
Financial Stability

More Telugu News