పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలి... అటవీ శాఖ అధికారులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- అభివృద్ధి పనులకు అటవీ అధికారులు సహకరించాలని స్పష్టమైన ఆదేశం
- పోలీసుల్లా అటవీ శాఖ అధికారులు కూడా పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలని సూచన
- కలెక్టర్ల ఆదేశాలను కూడా పాటించడం లేదని సీఎం దృష్టికి ఫిర్యాదులు
- శ్రీశైలం, బద్వేలు ఘటనలను ఉదహరించిన ముఖ్యమంత్రి
"పోలీసు శాఖ పీపుల్స్ ఫ్రెండ్లీగా మారింది, కానీ అటవీ శాఖ మారలేదు. మారాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లు ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించకపోతే ఎలాగని ఆయన ప్రశ్నించారు. ఇటీవల నడక మార్గంలో శ్రీశైలం వెళుతున్న భక్తులను అటవీ అధికారులు అడ్డుకోవడం, బద్వేలులోనూ ఇదే తరహాలో వ్యవహరించడం వంటి ఘటనలను ఆయన ఉదహరించారు. అధికారుల ఆచరణ సాధ్యం కాని ఆలోచనల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీఎం అసహనం వ్యక్తం చేశారు.
అటవీ అధికారులు తమ పరిధిలోని జిల్లా కలెక్టర్ల కింద పనిచేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పర్యావరణహిత ప్రాజెక్టులకు నిబంధనల మేరకు సహకరించాలే తప్ప, అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించవద్దని ఆదేశించారు. గ్రీన్ కవర్ పెంచడం, జీవవైవిధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని, ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని ఆయన తేల్చిచెప్పారు.