Sanju Samson: ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు కనపడ్డాయి... వాంఖెడేలో టీమిండియా కళ్లుచెదిరే స్కోరు

Sanju Samson Leads India to Huge Score Against England
వాంఖడేలో పరుగుల వరద పారించిన టీమిండియా
ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోసిన సంజు శాంసన్
నిర్ణీత 20 ఓవర్లలో 253 పరుగులు చేసిన భారత్
మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్, శివమ్ దూబే
ఇంగ్లాండ్ ముందు 254 పరుగుల భారీ లక్ష్యం
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో సెమీఫైనల్ పోరులో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు నిర్ణయం బెడిసికొట్టేలా భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 253 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. దీంతో ఇంగ్లండ్ ముందు 254 పరుగుల కఠినమైన లక్ష్యం నిలిచింది.

ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన శాంసన్.. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 89 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. అంతకుముందు ఓపెనర్ అభిషేక్ శర్మ (9) త్వరగా పెవిలియన్ చేరినా, ఇషాన్ కిషన్ (39: 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి శాంసన్ స్కోరు బోర్డును రాకెట్ వేగంతో ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 97 పరుగులు జోడించి ఇంగ్లాండ్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.

ఆ తర్వాత వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్లు కూడా తగ్గేదేలే అన్నట్లు బ్యాటింగ్ చేశారు. శివమ్ దూబే 25 బంతుల్లో 4 సిక్సర్లతో 43 పరుగులు చేయగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులకే వెనుదిరిగాడు. ఇక ఇన్నింగ్స్ చివర్లో హార్దిక్ పాండ్యా, యువ సంచలనం తిలక్ వర్మ విధ్వంసం సృష్టించారు. హార్దిక్ 12 బంతుల్లో 27 పరుగులు చేయగా, తిలక్ వర్మ కేవలం 7 బంతుల్లోనే 3 భారీ సిక్సర్లతో 21 పరుగులు పిండుకున్నాడు. భారత బ్యాటర్ల ధాటికి పవర్ ప్లేలోనే జట్టు స్కోరు 67కు చేరగా, చివరి ఓవర్లలోనూ పరుగుల మోత మోగింది.

ఇంగ్లండ్ బౌలర్లలో ఎవరూ భారత బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు. స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తన 4 ఓవర్లలో ఏకంగా 61 పరుగులు సమర్పించుకుని భారీగా నిరాశపరిచాడు. విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీసినప్పటికీ పరుగుల ప్రవాహాన్ని ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. వాంఖడే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుండటంతో, ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో అడుగుపెట్టాలంటే ఇంగ్లండ్ ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. భారత బౌలర్లు అర్ష్‌దీప్, బుమ్రా ఈ స్కోరును ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి.
Sanju Samson
India vs England
T20 World Cup 2026
Wankhede Stadium
Indian Cricket Team
England Cricket Team
Hardik Pandya
Tilak Varma
Ishan Kishan
Shivam Dube

More Telugu News