Vijay Deverakonda: 'రణబాలి' పోస్టర్ వెనుక కథ.. ఎమోషనల్ అయిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Emotional About Ranabali Poster Story
  • 'రణబాలి సినిమాలోని వెడ్డింగ్ పోస్టర్ వెనుక కథను వివరించిన దర్శకుడు
  • 1800ల నాటి సహజత్వం కోసమే ఆ ఫోటోలో నటన లేకుండా చూసుకున్నామన్న రాహుల్
  • డైరెక్టర్ విజన్ చూసి ఎమోషనల్ అయ్యానన్న విజయ్ దేవరకొండ
  • నిజ జీవిత పెళ్లికి, సినిమాలోని సన్నివేశానికి ఉన్న సంబంధాన్ని గుర్తుచేసుకున్న హీరో
టాలీవుడ్ నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం 'రణబాలి'లో వెండితెరపై కనువిందు చేయనున్నారు. వీరిద్దరి నిజ జీవిత వివాహాన్ని పురస్కరించుకుని, చిత్ర బృందం శనివారం నాడు సినిమాలోని వారి వెడ్డింగ్ పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే ఈ పోస్టర్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను దర్శకుడు రాహుల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ పోస్టర్ గురించి రాహుల్ వివరిస్తూ.. "దీన్ని ఒక సినిమా పోస్టర్‌గా డిజైన్ చేయలేదు. ఇది ఒక మధుర క్షణం. మన తల్లిదండ్రులు, తాతయ్యల పాత ఫోటోల్లో ఉండే సహజత్వం నాకు చాలా ఇష్టం. అందులో ఎలాంటి పోజింగులు, నటించిన నవ్వులు ఉండవు. కేవలం స్వచ్ఛమైన నిజం ఉంటుంది. రణబాలి సినిమా 1800ల నాటి కాలంలో సాగుతుంది. ఆ కాలం నాటి నిబద్ధత, గాంభీర్యం ఈ ఫోటోలో ప్రతిబింబించాలని కోరుకున్నాను" అని తెలిపారు. విజయ్, రష్మిక పెళ్లి దుస్తుల్లో సెట్‌కి వచ్చినప్పుడు, వారు కాలంలో వెనక్కి ప్రయాణించి అక్కడికి వచ్చినట్లు అనిపించిందని, వారిలో అప్పుడు కనిపించింది నటన కాదని రాహుల్ పేర్కొన్నారు. సినిమా, నిజ జీవితం ఒక్కోసారి ఇలా అద్భుతంగా కలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

దర్శకుడి పోస్ట్‌పై విజయ్ దేవరకొండ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. "రాహుల్.. నీ మాటలు నన్ను ఎమోషనల్ చేశాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వు తీసుకునే జాగ్రత్త, చూపించే శ్రద్ధ నన్ను ఎంతగానో ఉత్సాహపరుస్తోంది. ఇది మన నేల కథ. గొప్ప సినిమాని అందించే ఈ ప్రయాణంలో నేను, రష్మిక నీతో పూర్తిగా ఉంటాం" అని విజయ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vijay Deverakonda
Ranabali
Rashmika Mandanna
Rahul Sankrityan
Tollywood
Movie Poster
Wedding Poster
Historical Film
Telugu Cinema

More Telugu News