Godavari Pushkaralu: 2027 గోదావరి పుష్కరాలు: మహా కుంభమేళా తరహాలో నిర్వహణకు ఏపీ సర్కార్ నిర్ణయం

Godavari Pushkaralu 2027 Grand Celebration Planned by AP Government
  • 2027 గోదావరి పుష్కరాలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
  • మహా కుంభమేళా స్థాయిలో పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయం
  • సుమారు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
  • 6 జిల్లాల్లో మొత్తం 369 స్నానఘట్టాల ఏర్పాటుకు ప్రణాళిక
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పుష్కరాలకు సుమారు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన నిన్న సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు కందుల దుర్గేశ్, సత్యకుమార్ యాదవ్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,  ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు పన్నెండు రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలను ఆరు జిల్లాల్లో ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా మరిన్ని నిర్మించి, మొత్తం 369 స్నానఘట్టాలను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, పోలవరం జిల్లాల్లో ఈ ఏర్పాట్లు జరగనున్నాయి.

భక్తుల కోసం సాధారణ ధరలకే టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీ నిర్ణయించింది. పుష్కరాల ప్రధాన రోజుల్లో దాదాపు కోటి మంది వరకు భక్తులు రావొచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో, భద్రతకు పెద్దపీట వేయాలని తీర్మానించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించనున్నారు.
 
Godavari Pushkaralu
AP Government
2027 Godavari Pushkaralu
Andhra Pradesh
Kumbh Mela
Anam Ramanarayana Reddy
Pushkaralu arrangements
Godavari River
Temple affairs

More Telugu News