Mamata Ahirwar: ఏడుపు ఆపలేదని... పసిబిడ్డను పొయ్యిలోకి విసిరేసిన కిరాతకురాలు!

Mamata Ahirwar Arrested for Killing Infant Son in Hyderabad
  • హైదరాబాద్ బౌరంపేటలో అమానుష ఘటన
  • ఏడుస్తున్నాడని రెండు నెలల పసికందును పొయ్యిలో వేసిన తల్లి
  • తండ్రి ఫిర్యాదుతో నిందితురాలైన తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్ నగరంలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే రెండు నెలల పసికందు పట్ల కసాయిగా మారింది. నిరంతరం ఏడుస్తున్నాడన్న కోపంతో, పసిబిడ్డను మండుతున్న కట్టెల పొయ్యిలోకి విసిరేసి చంపేసింది. ఈ అమానుష సంఘటన మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో వెలుగు చూసింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేంద్ర ఆదివాసి (21), మమత అహిర్వార్ (20) దంపతులు. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి బౌరంపేటలోని ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో కార్మికులుగా పనిచేస్తూ, అక్కడే ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్డులో నివసిస్తున్నారు. వీరికి రెండు నెలల కుమారుడు ఉన్నాడు. 

సోమవారం రాత్రి బాబు నిరంతరం ఏడుస్తుండటంతో తల్లి మమత తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఏడుపు ఆపడానికి బాబు నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి, ఆపై మండుతున్న కట్టెల పొయ్యిలో పడేసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. పని ముగించుకుని వచ్చిన తండ్రి రాజేంద్ర.. బాబు కనిపించకపోవడంతో భార్యను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వెతకగా, పొయ్యిలో కాలిపోయిన స్థితిలో బాబు మృతదేహం కనిపించింది. 

భర్త ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితురాలైన తల్లి మమతను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పసికందు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 
Mamata Ahirwar
Hyderabad crime
infanticide
child murder
Dundigal police
Medchal Malkajgiri
crime news
Bowrampet
Andhra Pradesh
Telangana

More Telugu News