Bhopal: సహ విద్యార్థిపై టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కిరాతకం.. 30 సెకన్లలో 27 కత్తిపోట్లు

Bhopal Crime 27 Stabs in 30 Seconds by Students
  • భోపాల్‌ స్నూకర్ క్లబ్‌లో 10వ తరగతి విద్యార్థిపై కిరాతక దాడి
  • 30 సెకన్లలో 27 సార్లు కత్తితో పొడిచిన సహ విద్యార్థులు
  • దాడి వీడియోను స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నిందితులు
  • స్నూకర్ గేమ్‌లో ఆధిపత్య పోరే కారణమని వెల్ల‌డి
  • మైనర్లను అదుపులోకి తీసుకుని, నోటీసులిచ్చి వదిలేయడంపై విమర్శలు
మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ స్నూకర్ గేమ్‌లో మొదలైన చిన్న గొడవ, 10వ తరగతి విద్యార్థిపై హత్యాయత్నానికి దారితీసింది. కేవలం 30 సెకన్ల వ్యవధిలో బాధితుడిని 27 సార్లు కత్తితో పొడిచిన నిందితులు, ఆ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వయంగా సోషల్ మీడియాలో వైరల్ చేయడం వారి తెగింపునకు అద్దం పడుతోంది. ఈ ఘటన నగరంలో తీవ్ర సంచలనం రేపుతోంది.

అస‌లేం జ‌రిగిందంటే..!
గౌతమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 16 ఏళ్ల విద్యార్థి, గణేశ్‌ చౌక్‌లోని ఓ స్నూకర్ క్లబ్‌కు తరచూ వెళ్తుంటాడు. ఈ నెల‌ 15 రాత్రి అతను క్లబ్‌లో ఉన్నప్పుడు, ఇద్దరు మైనర్లు లోపలికి ప్రవేశించారు. బాధితుడిని కార్నర్ చేసి, వెంట తెచ్చుకున్న కత్తి, బాకుతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కేవలం అర నిమిషంలో 27 సార్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో బాధితుడి ఒక చేతి మణికట్టుపై 10కి పైగా లోతైన గాయాలు కాగా, మరో చేతి రెండు వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. భుజం, వీపుపై కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. అయినప్పటికీ ఆ విద్యార్థి వారి నుంచి తప్పించుకుని బయటపడటంతో స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు.

పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుడు, నిందితులు ముగ్గురూ 10వ తరగతి విద్యార్థులే కాకుండా ఒకే కోచింగ్ సెంటర్‌లో చదువుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం స్నూకర్ ఆడుతున్నప్పుడు ఆధిపత్యం కోసం వారి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో బాధితుడు నిందితులిద్దరినీ చెంపదెబ్బ కొట్టాడని, దీనికి ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటన తాలూకు వీడియో బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది. అయితే, ఈ కేసులో పోలీసుల స్పందనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత సాధారణ దాడి సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, నిందితులైన మైనర్లను అదుపులోకి తీసుకుని, నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. బాధితుడి వైద్య నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని కఠినమైన సెక్షన్లు చేర్చుతామని సబ్-ఇన్‌స్పెక్టర్ మణిపాల్ సింగ్ భదోరియా తెలిపారు. ఒక చిన్న గొడవ ఇంతటి కిరాతకానికి దారితీయడం, నిందితులు స్వయంగా వీడియోను వైరల్ చేసేంత ధైర్యం ప్రదర్శించడం చూసి స్థానికులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనర్లలో పెరుగుతున్న ఈ నేర ప్రవృత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Bhopal
Madhya Pradesh Crime
Student Attack
Knife Attack
Minor Crime
Snooker Club Fight
Ganesh Chowk
Bhopal Police
Crime News India

More Telugu News