Srinivas: యూట్యూబర్ శ్రీనివాస్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. స్నేహితుడే సూత్రధారి!

YouTuber Srinivas Murder Case Friend Mastermind
  • రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును ఛేదించిన పోలీసులు
  • ఆర్థిక వివాదాలతో స్నేహితుడే కిరాయి ఇచ్చి హత్య చేయించినట్టు నిర్ధారణ
  • ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహంతో కారును పాలేరు జలాశయంలోకి తోసివేత
  • ప్రధాన నిందితుడైన స్నేహితుడితో పాటు ముగ్గురు కిరాయి హంతకుల అరెస్ట్
రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసు మిస్టరీని తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో తేడాలు రావడంతో ఆయన స్నేహితుడే కిరాయి హంతకులతో ఈ దారుణానికి పాల్పడినట్టు తేల్చారు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహంతో ఉన్న కారును జలాశయంలోకి తోసేసినట్టు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి శ్రీనివాస్ స్నేహితుడితో పాటు మరో ముగ్గురు కిరాయి హంతకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే, ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలో ఫిబ్రవరి 14న ఓ కారు పడి ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు దూకి పారిపోయినట్టు అక్కడి మత్స్యకారులు తెలిపారు. కారును బయటకు తీసి చూడగా, అందులో శ్రీనివాస్ (48) మృతదేహం లభించింది. ఆయన తలపై గాయాలు ఉండటంతో పోలీసులు అనుమానించారు. మృతుడు ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా అల్లూరు గ్రామ వాసిగా గుర్తించారు. 2014లో 'పవన్ కల్యాణ్ హఠావో-పాలిటిక్స్ బచావో' అనే పుస్తకం ప్రచురించిన తర్వాత శ్రీనివాస్ వార్తల్లోకి ఎక్కారు.

శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇది హత్యేనని అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. వారం రోజుల్లోనే కేసులో పురోగతి సాధించి, శ్రీనివాస్ స్నేహితుడు వేణుమాధవరెడ్డితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పి. కోటేశ్వరరావు, షేక్ అబ్దుల్ హఫీజ్, అజ్మత్ అలీ అనే ముగ్గురు కిరాయి హంతకులను అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, కొన్ని లావాదేవీల కోసం తన జీఎస్టీ ఖాతాను వాడుకునేందుకు శ్రీనివాస్‌... మాధవరెడ్డికి అనుమతి ఇచ్చారు. అయితే, జీఎస్టీ బకాయిల విషయంలో అధికారుల నుంచి శ్రీనివాస్‌కు నోటీసులు రావడంతో, ఒప్పందం ప్రకారం ఆ డబ్బు చెల్లించాలని మాధవరెడ్డిపై శ్రీనివాస్ ఒత్తిడి పెంచారు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని మాధవరెడ్డి నిర్ణయించుకుని, కిరాయి హంతకులను రంగంలోకి దించాడు.

విజయవాడ వెళుతున్న శ్రీనివాస్‌ను నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద కారులోనే హత్య చేశారు. ఆ తర్వాత నేరాన్ని కప్పిపుచ్చేందుకు మృతదేహంతో సహా కారును పాలేరు జలాశయంలోకి తోసేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు.


Srinivas
YouTuber Srinivas murder
Bogguila Srinivas
Telangana police
Palairu reservoir
Nandyala district
GST dues
Venumadhava Reddy
contract killers

More Telugu News