International Fleet Review: విశాఖలో వేడుకగా 'ఇంటర్నేషనల్ సిటీ పరేడ్'

International Fleet Review Visakhapatnam City Parade Held Grandly
షార్ట్స్‌లో చూడండి
'సిటీ ఆఫ్ డెస్టినీ' విశాఖపట్నం సాగర తీరం గురువారం సాయంత్రం అద్భుత ప్రదర్శనలకు వేదికైంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR), మిలన్ 2026 వేడుకల్లో భాగంగా ఆర్కే బీచ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ నగర పరేడ్ కన్నుల పండువగా సాగింది. భారత నావికాదళ శక్తి సామర్థ్యాలు, వివిధ దేశాల సాంస్కృతిక వైభవానికి ఈ పరేడ్ దర్పణం పట్టింది.

ఈ భారీ పరేడ్‌లో భాగంగా తొలుత భారత నావికాదళ విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో అబ్బురపరిచే విన్యాసాలు చేశాయి. అనంతరం భారత త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్), కోస్ట్ గార్డ్ కంటింజెంట్లు కవాతు నిర్వహించాయి. వీరితో పాటు ఫ్రాన్స్, రష్యా, వియత్నాం, థాయ్‌లాండ్, శ్రీలంక సహా పలు మిత్ర దేశాల నావికాదళ సిబ్బంది, వారి సెరిమోనియల్ బ్యాండ్‌లు ప్రదర్శనలో పాల్గొని ఆకట్టుకున్నాయి.

ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. నేవీ కమాండోలు ప్రదర్శించిన సాహస కృత్యాలు, డ్రోన్, లేజర్ షోలు, చివరిలో బాణసంచా వెలుగులు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. వివిధ దేశాల కళాకారులు వారి సంప్రదాయ నృత్యాలతో అలరించారు.

భారత నౌకాదళ శక్తిని ప్రపంచానికి చాటడంతో పాటు, మిత్ర దేశాలతో సముద్ర భద్రతలో సహకారాన్ని, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పరేడ్‌ను నిర్వహించారు. ఈ అంతర్జాతీయ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ఆర్కే బీచ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. నిర్వాహకులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Go Back to Shorts
International Fleet Review
IFR 2026
Visakhapatnam
Indian Navy
City Parade
RK Beach
Andhra Pradesh
Naval Exercise
Military Parade
Milan 2026

More Telugu News