Atchannaidu: హెరిటేజ్ సంస్థ నోటీసులు ఇచ్చినా బుద్ధి మార్చుకోవడం లేదు: బొత్సపై అచ్చెన్న ఫైర్

Atchannaidu Fires at Botsa Over Heritage Allegations in AP Council
  • విజిల్స్ వేస్తూ మండలిలో హంగామా చేసిన వైసీపీ సభ్యులు
  • చీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి అంటున్నారని బొత్సపై అచ్చెన్న మండిపాటు
  • సాక్షి, భారతి సిమెంట్స్ ద్వారా జగన్ ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆరోపణ

ఏపీ శాసనమండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైసీపీ సభ్యులు... ఛైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేస్తూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు వాయిదా పడంది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆందోళన చేస్తున్నారని, హెరిటేజ్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో చీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి అని చెబుతున్నారని... సీనియర్ నేత అయిన బొత్సకు నెయ్యికి, చీజ్ కు తేడా తెలియదా? అని ఎద్దేవా చేశారు.


అసత్య ప్రచారం చేస్తున్న బొత్సకు హెరిటేజ్ సంస్థ నోటీసులు కూడా ఇచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. అయినా ఆయన బుద్ధి మార్చుకోవడం లేదని... ఇది మన దౌర్భాగ్యమని అన్నారు. హెరిటేజ్ కు, ఇందాపూర్ డెయిరీకి మధ్య సంబంధం ఉన్నట్టు ఏ ఆధారాలు ఉన్నా తీసుకురావాలని అన్నారు. ఏపీలోనే కాకుండా ఏ రాష్ట్రంతో కూడా వ్యాపార లావాదేవీలు జరపకూడదనే నిర్ణయాన్ని హెరిటీజ్ తీసుకుందని చెప్పారు. వైసీపీ సభ్యలు ప్రతిరోజూ ఒకే అంశంపై వాయిదా తీర్మానాన్ని ఇస్తూ శాసనమండలి సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు.


ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని సాక్షి, భారతి సిమెంట్స్ ద్వారా ప్రజల సొమ్మును జగన్ దోచుకున్నారని... జగన్ మాదిరి హెరిటేజ్ ఎప్పుడూ చేయదని అన్నారు. ఆధారాలు లేకుండా సమాధానం చెప్పాలంటే ఏం చెప్పాలని ప్రశ్నించారు. సభకు ఆటంకం కలిగిస్తున్న వైసీపీ సభ్యులపై మండలి చైర్మన్ చర్యలు తీసుకోవాలని కోరారు.
Atchannaidu
Heritage Dairies
Botsa Satyanarayana
Andhra Pradesh
AP Legislative Council
Indapur Dairy
YSRCP
TDP
Sakshi
Bharathi Cements

More Telugu News