Ratan Sahukar: బంగ్లాదేశ్‌లో దారుణం: ఎన్నికల ముందు హిందూ యువకుడి దారుణ హత్య

Ratan Sahukar Hindu Youth Brutally Murdered Before Bangladesh Election
  • చేతులు, కాళ్లు కట్టేసి ఉన్న స్థితిలో లభించిన మృతదేహం
  • మృతుడు తేయాకు తోట కార్మికుడు రతన్ సాహుకర్‌గా గుర్తింపు
  • మైనారిటీల భద్రతపై తీవ్ర ఆందోళనలు
  • ఘటనపై బంగ్లాదేశ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభం
బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ఒకరోజు ముందు దారుణం చోటుచేసుకుంది. మౌల్వీబజార్ జిల్లాలో ఓ హిందూ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. మృతుడి చేతులు, కాళ్లు కట్టేసి ఉండగా, శరీరంపై లోతైన గాయాలున్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా మైనారిటీ వర్గాల్లో తీవ్ర భయాందోళనలకు కారణమైంది.

మౌల్వీబజార్ జిల్లాలోని ఇస్లాంపూర్ యూనియన్‌లో ఉన్న చంపార తేయాకు తోటలో పనిచేసే రతన్ సాహుకర్ (28) మృతదేహాన్ని స్థానికులు బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడి చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నట్లు ధ్రువీకరించారు. శరీరంపై ఉన్న గాయాల నుంచి రక్తం కారుతూనే ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఎన్నికల వేళ జరిగిన ఈ హత్యతో బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీ వర్గాలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మైమెన్‌సింగ్ జిల్లాలో సుసేన్ చంద్ర సర్కార్ (62) అనే మరో హిందూ వ్యాపారిని దుండగులు నరికి చంపిన ఘటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు. వరుస ఘటనలతో ఎన్నికల సమయంలో హింస చెలరేగుతుందేమోనని ఆందోళన పడుతున్నారు.

ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Ratan Sahukar
Bangladesh election violence
Hindu youth murdered
Moulvibazar district
Bangladesh minorities
Hindu businessman killed
political violence
election security
crime news
Bangladesh news

More Telugu News