Ramprasad Reddy: ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Ramprasad Reddy Announces Good News for APSRTC Employees
  • అర్హులైన 7,514 మందికి త్వరితగతిన పదోన్నతులు కల్పించాలన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
  • 7,673 ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశం
  • స్మార్ట్ కార్డుల టెండర్ నిబంధనలు త్వరగా ఖరారు చేయాలని మంత్రి ఆదేశాలు  
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, అర్హులైన 7,514 మందికి త్వరితగతిన పదోన్నతులు కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. సచివాలయంలో నిన్న రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో కలిసి ఆర్టీసీ, రవాణా శాఖలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మంత్రికి వివరాలు వెల్లడించారు. 2025-26 డీపీసీ కింద అర్హులైన ఉద్యోగుల ఎంప్యానల్‌ను ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో 44,131 మంది ఉద్యోగులే ఉన్నారని, వచ్చే మూడేళ్లలో 6,891 మంది పదవీ విరమణ చేయనున్నట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో 7,673 ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. 

అలాగే మెడికల్ అన్‌ఫిట్ అయిన 682 మంది ఉద్యోగుల్లో 36 మందికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు, మరో 646 మందికి ఆర్థిక పరిహారం చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఏపీలో తిరిగే బస్సులకు సంబంధించిన అఖిలభారత టూరిస్ట్ పర్మిట్ పన్నులపై ట్రావెల్స్ బస్సుల సంఘాలతో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. పన్ను తగ్గిస్తే ఆయా బస్సులు ఏపీలోనే రిజిస్ట్రేషన్ అవుతాయని రవాణా అధికారులు మంత్రికి వివరించారు. 

డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం జారీ చేసే స్మార్ట్ కార్డుల టెండర్ నిబంధనలు త్వరగా ఖరారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాలకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (వీఎల్‌టీ) ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉన్నందున, అందుకు సంబంధించిన ఆర్‌ఎఫ్‌పీ (ఆర్ఎఫ్‌పీ)ను సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రవాణా కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా, ఆర్టీసీ ఈడీలు బ్రహ్మానందరెడ్డి, రవివర్మ తదితరులు పాల్గొన్నారు.
Ramprasad Reddy
APSRTC
RTC employees
employee promotions
Andhra Pradesh transport
AP transport minister
job vacancies
bus registration
vehicle tracking
driving licenses

More Telugu News