Sri Ganesh: ఎమ్మెల్యే కాన్వాయ్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

RTC Bus Rams into MLA Sri Ganesh Convoy in Mancherial
  • డ్రైవర్ మద్యం మత్తులో బస్సును నడపడమే కారణం
  • మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన..
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఎమ్మెల్యే కాన్వాయ్ పైకి దూసుకెళ్లింది. ఎమ్మెల్యే కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. అయితే, బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం గమనించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంచిర్యాలలోని బస్టాండ్ రోడ్డులో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి మీదికి దూసుకొచ్చింది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎమ్మెల్యే పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతరం ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో ఎమ్మెల్యే మాట్లాడారు. బస్సు అదుపు తప్పడానికి కారణమేంటనే విషయంపై ఆరా తీస్తుండగా డ్రైవర్ జక్కుల మల్లేశ్ వద్ద నుంచి మద్యం వాసన వచ్చింది.

దీంతో పోలీసులను పిలిపించి డ్రైవర్ కు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయించారు. ఈ టెస్టులో 105 పాయింట్లు వచ్చిందని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి బస్సు నడిపినట్లు నిర్ధారణ కావడంతో డ్రైవర్ మల్లేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Sri Ganesh
Mancherial
MLA Sri Ganesh
RTC bus
drunk driving
Telangana
accident
bus accident
police complaint
Jakkula Mallesh

More Telugu News