Meghalaya Coal Mine: బొగ్గు గనిలో పేలుడు...16 మంది మృత్యువాత

Meghalaya Coal Mine Explosion Kills 10
  • మేఘాలయలోని బొగ్గు గనిలో భారీ పేలుడు
  • ఘటనలో 16 మంది కార్మికులు మృతి
  • మృతుల్లో ఎక్కువ మంది అసోం వాసులుగా అనుమానం
  • ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
మేఘాలయలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తాష్ఖై ప్రాంతంలోని ఓ బొగ్గు గనిలో గురువారం పేలుడు సంభవించడంతో, 16 మంది కార్మికులు మరణించారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

వార్తా సంస్థల కథనాల ప్రకారం, గని లోపల ఈ పేలుడు జరగడంతో కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా అసోం రాష్ట్రానికి చెందిన వలస కార్మికులుగా అధికారులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరిని కటిగొరా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ దుర్ఘటన గురించి తెలియగానే మేఘాలయ పోలీసులు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గనిలోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మేఘాలయలో తరచూ జరుగుతున్న చట్టవిరుద్ధమైన 'ర్యాట్-హోల్' మైనింగ్ వల్లే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభమైంది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Meghalaya Coal Mine
Meghalaya
Coal Mine Explosion
Assam
Rat-hole Mining
Mining Accident
Coal Miners
Tashkai

More Telugu News