Mamata Banerjee: బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు.. అసెంబ్లీలో మమతా బెనర్జీ కీలక ప్రకటన

Mamata Banerjee Ready to Give Land for Border Fencing
  • సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం కోసం కేంద్రానికి భూమి ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటన
  • బీఎస్ఎఫ్ అధికార పరిధి నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • దేశ భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో బంగ్లాదేశ్‌తో సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం కోసం కేంద్రానికి భూమి ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. అయితే అంతకంటే ముందు బీఎస్ఎఫ్ అధికార పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచుతూ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దులో కంచె ఏర్పాటును అడ్డుకుంటోందని కేంద్రం, బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. బీఎస్ఎఫ్‌తో సహా అన్ని కేంద్ర సంస్థలు, ఏజెన్సీలకు ఇప్పటికే భూమిని అందించామని తెలిపారు. దేశ భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మమతా బెనర్జీ అన్నారు. కంచె విషయంలో భూమి అనేది సమస్య కానే కాదని అన్నారు.

ఎంత భూమి అవసరమైతే అంత కేటాయిస్తామని, కానీ బీఎస్ఎఫ్ అధికార పరిధిపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. కంచె విషయంలో కొన్ని వాస్తవాలనే బీజేపీ ప్రజల ముందు ఉంచుతోందని ఆరోపించారు. రాష్ట్రం ఇప్పటికే ఎంత భూమిని ఇచ్చిందనే వివరాలను కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బెంగాల్‌లో చొరబాట్లు ముప్పుగా పరిణమించాయని, కంచె కోసం భూమి కోరుతూ కోంద్రం పలుమార్లు లేఖలు రాసినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని ప్రతిపక్ష నేత సువెందు అధికారి ఆరోపించారు. అయితే చొరబాట్లపై సాక్ష్యాలను చూపించాలని మమతా బెనర్జీ సవాల్ చేశారు. కంచె కోసం ఇప్పటికే కేటాయించిన భూమిలో ముందుగా పనులు పూర్తి చేయాలని సూచించారు.

More Telugu News

Mamata Banerjee
West Bengal
Bangladesh border
Border Security Force
BSF jurisdiction
Suvendu Adhikari