Narendra Modi: నిరసనల మధ్య... రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం... విపక్షాల వాకౌట్

Narendra Modi Speech in Rajya Sabha Amidst Protests Opposition Walkout
  • రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని ప్రసంగం
  • మాజీ ఆర్మీ చీఫ్ నరవణే పుస్తకంపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు
  • ప్రధాని మాట్లాడుతుండగా నినాదాలు.. సభ నుంచి వాకౌట్ చేసిన విపక్ష సభ్యులు
  • వికసిత భారత్ లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందన్న ప్రధాని మోదీ
  • భారత్‌తో వ్యాపారానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని వ్యాఖ్య
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇస్తుండగా, విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డంకి కలిగించి, చివరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సభ నుంచి వాకౌట్ చేశారు.

మాజీ సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం. నరవణే తన ఆత్మకథలో రాసిన కొన్ని కీలక అంశాలపై లోక్‌సభలో చర్చకు అనుమతించకపోవడమే ఈ గందరగోళానికి ప్రధాన కారణం. 2020లో చైనాతో సరిహద్దు ఘర్షణల సమయంలో రాజకీయ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందలేదని నరవణే పేర్కొన్నారని, ఆ భాగాలను చదివి వినిపించేందుకు లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశంపై గత మూడు రోజులుగా లోక్‌సభ దద్దరిల్లుతోంది. బుధవారం లోక్‌సభలో మహిళా ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలపడంతో సభ వాయిదా పడి, ప్రధాని ప్రసంగం నిలిచిపోయింది.

ఇవాళ రాజ్యసభలోనూ విపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యసభలో విపక్షాల నినాదాలు, అల్లరి మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. 'వికసిత భారత్' నిర్మాణంలో దేశం సరైన దిశలో వేగంగా పయనిస్తోందని అన్నారు. "గత కొన్ని సంవత్సరాలు దేశ వేగవంతమైన అభివృద్ధికి సాక్ష్యంగా నిలిచాయి. ప్రతి రంగంలోనూ ఇది మార్పుల యుగం" అని పేర్కొన్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు వృద్ధాప్యంలోకి వెళుతుంటే, యువశక్తితో ఉరకలేస్తున్న భారత్ ప్రపంచానికి కొత్త ఆశను అందిస్తోందని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా సాగుతోందని ధీమా వ్యక్తం చేశారు.

అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ పెరిగిందని, ఇటీవలే 9 కీలక వాణిజ్య ఒప్పందాలు కుదిరాయని ప్రధాని తెలిపారు. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణించారు. గత కొన్నేళ్లుగా చేపట్టిన సంస్కరణల కారణంగా ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్‌తో వ్యాపారం చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రధాని మాట్లాడుతున్నంత సేపు విపక్ష సభ్యులు 'విపక్ష నేతను మాట్లాడనివ్వండి', 'నియంతృత్వం నశించాలి' వంటి నినాదాలతో హోరెత్తించారు. 

ఈ క్రమంలో ప్రధాని మోదీ, విపక్ష నేత మల్లికార్జున ఖర్గేపై సరదాగా వ్యాఖ్యలు చేశారు. "ఖర్గే జీ వయసు, సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఆయన కూర్చునే నినాదాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి" అని ప్యానెల్ స్పీకర్ ను కోరుతున్నట్లు చమత్కరించారు. ఈ క్రమంలో విపక్షాలు సభ నుంచి నిష్క్రమించాయి. పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రభుత్వం కాలరాస్తోందని విపక్షాలు ఆరోపిస్తుండగా, అభివృద్ధి అజెండానే తమకు ముఖ్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

More Telugu News

Narendra Modi
Rajya Sabha
Parliament Budget Session
Opposition Walkout
Mallikarjun Kharge
MM Naravane Autobiography
China Border Clash
Rahul Gandhi
Indian Economy
Viksit Bharat