Revanth Reddy: కేసీఆర్.. నువ్వెలా జాతిపిత అవుతావు?: రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams KCR How Can He Be Father of Telangana
షార్ట్స్‌లో చూడండి
"భార్యాభర్తలు మాట్లాడుకుంటే దొంగచాటుగా విన్న సన్నాసివి, నువ్వెలా జాతిపిత అవుతావు?" అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసును ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం జరిగిన 'ప్రజా పాలన ప్రగతిబాట' భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై, బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు.

కొంతమంది 'జాతిపిత'ను విచారిస్తారా అని అడుగుతున్నారని, అసలు "ఎవరికిరా నువ్వు జాతిపిత? నీ జాతికి నువ్వు పిత కావొచ్చు.. మాకు కాదు" అని రేవంత్ రెడ్డి అన్నారు. "ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ మొత్తం కనుమరుగైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అవుతుంది. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతాడు. లు*, సన్నాసి, దొంగ అయిన నువ్వెలా జాతిపిత అవుతావు?" అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాట్లాడుతూ.. "అన్నం తినేవాళ్లు ఎవరైనా భార్యాభర్తలు మాట్లాడుకుంటే వింటారా? సిగ్గుతో తలదించుకోవాలి. నిజానికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ముఖాలకు ముసుగులు తొడిగి పోలీసులు విచారణకు తీసుకురావాల్సింది" అని వ్యాఖ్యానించారు.

తాము జాతిపిత అయితే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్, కేటీఆర్ జన్‌వాడ ఫామ్‌హౌస్, హరీశ్‌రావు మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లతో పాటు వేల కోట్ల ఆస్తులను తెలంగాణ ప్రజలకు రాసిస్తారా అని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు కనీసం చిన్న పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

స్థానిక నేతపై విమర్శలు, అభివృద్ధి పనులకు శ్రీకారం

సభకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో రూ.200 కోట్లతో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావును 'నమ్మకద్రోహి', 'నక్క జిత్తుల వ్యక్తి' అని అభివర్ణించారు. "జానారెడ్డి చెప్పులు, నీళ్లసీసాలు మోసిన భాస్కర్‌రావు, ఎమ్మెల్యేగా గెలిచాక ఆత్మగౌరవాన్ని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ పాదాల దగ్గర పెట్టాడు. అలాంటి వ్యక్తికి మళ్లీ ఓటేస్తారా? గంగిరెద్దుల్లా ఓట్లు అడగడానికి వస్తే కర్రు కాల్చి వాత పెట్టండి" అని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయి

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. "పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము లక్షలాది కార్డులిచ్చి సన్న బియ్యం అందిస్తున్నాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు ఎకరానికి రూ.6 వేల రైతు భరోసా, రూ.500 బోనస్‌తో పాటు రుణమాఫీ చేశాం. 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం" అని ప్రభుత్వ విజయాలను వివరించారు. ఓటు వేసే ముందు ఈ పథకాలన్నింటినీ గుర్తు చేసుకోవాలని కోరారు. మున్సిపల్ శాఖ తన వద్దే ఉందని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాలను అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
KCR
Telangana
BRS
Phone Tapping
Sonia Gandhi
Professor Jayashankar
Telangana Politics

More Telugu News