Ambati Rambabu: అంబటి రాంబాబు ఇంటికి వెళ్లిన జగన్... కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం

Ambati Rambabu House Visit Jagan Slams AP Government
  • మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్
  • రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం
  • మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని కూటమికి ఘాటు హెచ్చరిక
  • టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన అంబటి ఇంటిని, వాహనాలను పరిశీలన
  • తిరుమల నెయ్యి వివాదంపై స్పందిస్తూ చంద్రబాబుపై విమర్శలు
 గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని, జంగిల్ రాజ్ నడుస్తోందని జగన్ తీవ్రంగా విమర్శించారు. దాడులు చేసిన వారిని వదిలేసి, బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం నాడు గుంటూరు పర్యటనలో భాగంగా, ఇటీవల దాడికి గురైన అంబటి నివాసానికి వెళ్లిన జగన్, ధ్వంసమైన ఇంటిని, వాహనాలను పరిశీలించారు. గుడి నుంచి వస్తున్న అంబటిపై టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లతో దాడి చేశారని, పోలీసుల సమక్షంలోనే కార్లను పగలగొట్టారని ఆరోపించారు. బాధితుడైన అంబటిని అరెస్ట్ చేసి, దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం దారుణమని అన్నారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, "ఇలాంటి దాడులతో వైసీపీ నాయకులను భయపెట్టగలమనుకుంటే మీ అంత మూర్ఖుడు లేడు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. మూడేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం" అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి ఘాటు వార్నింగ్ ఇచ్చారు. చేసిన తప్పులకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లెక్కలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అనంతరం తిరుమల నెయ్యి వివాదంపై కూడా జగన్ స్పందించారు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ల్యాబ్ నివేదికలు స్పష్టం చేశాయని, కేవలం తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే చంద్రబాబు కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News

Ambati Rambabu
Jagan
YS Jagan
Andhra Pradesh Politics
Guntur
TDP Attacks
Chandrababu Naidu
Tirumala Ghee
YSRCP
AP Elections 2024