Ajit Doval: చరిత్రలో మన ఆలయాలపై దాడులు చేశారు కానీ మనం ఎవరికీ హానీ చేయలేదు: అజిత్ దోవల్

Ajit Doval says India never harmed anyone despite historical attacks
  • మన పూర్వీకులు ఏ దేశ ప్రజలకూ హాని చేయలేదన్న అజిత్ దోవల్
  • మన దేశ చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని సూచన
  • సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వారి ధీరత్వాన్ని పుణికిపుచ్చుకోవాలని వ్యాఖ్య
చరిత్రలో ఇతర దేశాలు మనపై దాడులు చేసి ఆలయాలను, గ్రామాలను ధ్వంసం చేసినప్పటికీ, మన పూర్వీకులు ఏ దేశ ప్రజలకూ ఎటువంటి హాని చేయలేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్కొన్నారు. 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' కార్యక్రమంలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మన దేశ చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని సూచించారు.

ప్రతీకారం ఎప్పుడూ మంచిది కాదని, దానిని ప్రేరణ శక్తిగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే, దేశ చరిత్రపై గతంలో జరిగిన అణిచివేతకు మనం ప్రతీకారం తీర్చుకోవాలని...  అది ఎలాగంటే... మనం దేశీయ సైనిక, ఆర్థిక, సామాజిక భద్రతను బలోపేతం చేసుకోవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని అన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, గాంధీ వంటి వారి ధీరత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

చరిత్రలో మనపై దాడులు చేసి, ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నాయని, కానీ మనం ఎవరికీ హానీ చేయలేదని ఆయన అన్నారు. ఆ సంఘటనల నుంచి మనం పాఠాలు నేర్చుకుని, మనం కూడా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ప్రగతిశీల సమాజం వైపు అడుగులు వేయాలని సూచించారు. దేశం అభివృద్ధి బాటలో నడవడానికి సరైన నాయకత్వం అవసరమని అన్నారు. ఈ సందర్భంగా నాయకత్వం యొక్క గొప్పతనం గురించి చెబుతూ, ఒక గొర్రె నేతృత్వంలోని వెయ్యి సింహాలకు భయపడను కానీ సింహం నేతృత్వంలోని వెయ్యి గొర్రెలకు భయపడతానని ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ అన్న మాటలను గుర్తు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. కేవలం పదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు నడిపిందని అన్నారు. మరికొన్నేళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం వంటి విషయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్ధత, కృషి, నాయకత్వ భావాలు, అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
Ajit Doval
India history
attacks on temples
Vikshit Bharat
Young Leaders Dialogue
national security

More Telugu News