Prabhas: ప్రభాస్ 'ది రాజాసాబ్' తొలిరోజు కలెక్షన్లు... బాక్సాఫీస్ షేక్ అయింది!
- నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ తొలిరోజు సత్తా చాటిన 'ది రాజాసాబ్'
- రూ. 112 కోట్ల గ్రాస్ వసూలు చేసిన చిత్రం
- ప్రీమియర్ల ద్వారానే రూ. 8 కోట్లకు పైగా ఆదాయం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తన సత్తా ఏంటో చాటిచెప్పాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ హారర్ కామెడీ ‘ది రాజా సాబ్’కు నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ... తొలిరోజు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హారర్ ఫాంటసీ సినిమాల్లో ఇదే అతి పెద్ద తొలిరోజు గ్రాస్ అని తెలిపింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం... భారత్‌లో తొలి రోజు రూ.65 కోట్లకు పైగా గ్రాస్ వసూలయింది. ఇందులో ప్రధాన వాటా తెలుగు రాష్ట్రాలదే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి కనీసం రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలైంది. ప్రీమియర్ షోల ద్వారానే రూ.8 కోట్లకు పైగా ఆదాయం రావడం విశేషం.
విదేశాల్లోనూ ‘ది రాజా సాబ్’ మంచి ప్రదర్శన కనబరిచింది. ఓవర్సీస్ మార్కెట్‌లో రూ30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ముందస్తు బుకింగ్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రావడం గమనార్హం. భారత్‌లో టికెట్ బుకింగ్స్ మరింత ముందుగానే ప్రారంభించి ఉంటే ఈ సంఖ్య ఇంకా పెరిగేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘కల్కి 2898 AD’, ‘సలార్’ స్థాయిలో అడ్వాన్స్ సేల్స్ కాకపోయినా, బలమైన ఓపెనింగ్ సాధించింది.