Vikram Rathour: శ్రీలంక బ్యాటింగ్ కోచ్ గా టీమిండియా మాజీ కోచ్

Vikram Rathour Appointed Sri Lanka Batting Coach Ahead of T20 World Cup
  • శ్రీలంక బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ కోచ్ విక్రమ్ రాథోడ్
  • టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహాల్లో భాగంగా ఈ నియామకం
  • జనవరి 18 నుంచి మార్చి 10 వరకు సేవలు అందించనున్న రాథోడ్
  • బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఇప్పటికే లసిత్ మలింగ నియామకం
టీ20 ప్రపంచకప్ 2026 సమీపిస్తున్న వేళ, శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) తమ జట్టును బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌ను తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.

రాథోడ్ కన్సల్టెంట్ ప్రాతిపదికన ఈ బాధ్యతలు చేపడుతున్నాడని, ప్రధానంగా టీ20 ప్రపంచకప్ సన్నాహకాలపై దృష్టి సారిస్తాడని శ్రీలంక క్రికెట్ తెలిపింది. జనవరి 18న బాధ్యతలు స్వీకరించి, మార్చి 10 వరకు జట్టుతో కొనసాగుతాడని పేర్కొంది. 2019 నుంచి 2024 వరకు భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన రాథోడ్ పర్యవేక్షణలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా 2024లో టీ20 ప్రపంచకప్ గెలవడంలో అతడి పాత్ర కీలకం. భారత జట్టుతో ఒప్పందం ముగిశాక, విక్రమ్ రాథోడ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌ (బ్యాటింగ్) గా చేరాడు.

ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా శ్రీలంక ఇప్పటికే దిగ్గజ పేసర్ లసిత్ మలింగను కూడా ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 25 వరకు 40 రోజుల పాటు మలింగ సేవలు అందిస్తాడు.

ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, శ్రీలంక ఈ టోర్నీకి సహ-ఆతిథ్యం ఇస్తోంది. గ్రూప్ 'బి'లో ఉన్న శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఒమన్, ఐర్లాండ్, జింబాబ్వేలతో తలపడనుంది. ఫిబ్రవరి 8న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
Vikram Rathour
Sri Lanka cricket
batting coach
T20 World Cup 2026
Lasith Malinga
India cricket
Rajasthan Royals
Sri Lanka team
cricket coach
T20 World Cup

More Telugu News