KTR: రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఏం అన్నాడో నేనూ అదే అన్నాను: కేటీఆర్

KTR Comments on Rahul Gandhi Echo Revanth Reddys Words
  • రాహుల్ గాంధీ పప్పు కాదు, ముద్దపప్పు అని రేవంత్ రెడ్డి అన్నారన్న కేటీఆర్
  • ఇప్పుడు నేనూ ముద్దపప్పు అన్నానని చెప్పిన కేటీఆర్
  • రేవంత్ రెడ్డిని విమర్శించిన తర్వాత తనను అనాలన్న కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమని సంబోధించారో, తాను అదే వ్యాఖ్య చేశానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ 'పప్పు' కాదని, 'ముద్దపప్పు' అని రేవంత్ రెడ్డి గతంలో అన్నారని, ఇప్పుడు తాను కూడా అదే పదం ఉపయోగించానని ఆయన స్పష్టం చేశారు.

"రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అసభ్యకర పదాలు మాట్లాడితే కోపం వచ్చి, నేను కూడా రాహుల్ గాంధీని ఒక మాట అన్నాను. నా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కానీ, నేను కొత్తగా ఏమీ అనలేదు. రేవంత్ రెడ్డి అన్న మాటనే నేను అన్నాను. మీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని 'పప్పు' కాదు 'ముద్దపప్పు' అని అన్నారు. కాబట్టి ఆ విమర్శలు ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డిపై చేయండి. మీ సోనియా గాంధీని మీ రేవంత్ రెడ్డి 'బలిదేవత' అన్నారు. అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి మీరు ముఖ్యమంత్రిగా చేశారు. తనను ముఖ్యమంత్రిగా చేసిన రాహుల్ గాంధీని 'ముద్దపప్పు' అని అన్నది రేవంత్ రెడ్డే" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ 'దద్దమ్మ' కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం రైతులు కుస్తీలు పట్టాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ఒక్క బస్తా యూరియా కోసం కూడా భారీ క్యూలైన్‌లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి క్రాప్‌ హాలిడేలు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో యూరియా కోసం కుస్తీలు లేవని, విత్తనాల కోసం పోటీ లేదని, కరెంటు కష్టాలు లేవని, క్రాప్‌ హాలిడేలు లేవని ఆయన వెల్లడించారు.

పెండింగ్‌ పనులు పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టారని కేటీఆర్‌ ఆరోపించారు. కేవలం 10 శాతం పనులు పూర్తి చేస్తే వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నా ఈ ప్రభుత్వం ఆ పని చేయడం లేదని విమర్శించారు. పెండింగ్‌ పనులు పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని, తన బాస్‌కు కోపం వస్తుందనే భయంతో రేవంత్‌ రెడ్డి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయన అన్నారు.
KTR
Rahul Gandhi
Revanth Reddy
Telangana
BRS
Congress
Mudda Pappu
Palamuru Rangareddy Project

More Telugu News