Vasantha Krishna Prasad: వైసీపీ నేతలది నీతిమాలిన రాజకీయం: వసంత కృష్ణప్రసాద్
- భోగాపురం విమానాశ్రయంపై వైసీపీ దిక్కుమాలిన రాజకీయం చేస్తోందన్న కృష్ణప్రసాద్
- ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకుంటోందని విమర్శ
- ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సరికాదని హితవు
భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ పై కూటమి ప్రభుత్వం - వైసీపీ మధ్య క్రెడిట్ పంచాయితీ తారాస్థాయికి చేరింది. రెండు రోజుల క్రితం మొదటి వాలిడేషన్ ఫ్లైట్ సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయిన తర్వాత ఈ రచ్చ మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీపై ఘాటుగా విరుచుకుపడ్డారు.
"భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై వైసీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోంది. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డ అని చెప్పుకునే స్థాయికి వైసీపీ నాయకులు దిగజారారు" అంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సూచనలు ఇస్తే స్వీకరిస్తామని, కానీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు.
మెడికల్ కాలేజీల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి కృషి చేస్తుంటే, వైసీపీ కోటి సంతకాల పేరుతో కుట్రలు పన్నుతోందని విమర్శించారు. అనవసర రాజకీయాలు మాని ప్రజల మేలు కోసం పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో కొంత అయినా ప్రజలు ఆదరిస్తారని, ఆ విషయం వైసీపీ నేతలు గ్రహించాలని సూచించారు.
కాగా, భోగాపురం ప్రాజెక్ట్ 2015లో చంద్రబాబు హయాంలో మొదలైంది. భూసేకరణ, టెండర్లు టీడీపీ హయాంలోనే పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్లీ కూటమి వచ్చాక పనులు వేగవంతమయ్యాయి. వైసీపీ ఇప్పుడు క్రెడిట్ కొట్టే ప్రయత్నం చేస్తోందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, భోగాపురం విమానాశ్రయంలో ఈ ఏడాది జూన్ నాటికి కమర్షియల్ ఆపరేషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది.