మన 'తేజస్' యుద్ధ విమానం తొలి గగన విహారానికి 25 ఏళ్లు
- స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజస్ విమానం
- 2001 జనవరి 4న బెంగళూరులో తొలిసారి నింగికెగిసిన యుద్ధ విమానం
- శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల కృషిని కొనియాడుతూ ఐఏఎఫ్ ట్వీట్
- ఇటీవలే మరో 97 తేజస్ ఎంకే-1ఏ విమానాల కొనుగోలుకు ఒప్పందం
2001 జనవరి 4న బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్ట్ నుంచి టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ (టీడీ-1)గా తేజస్ తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. వింగ్ కమాండర్ రాజీవ్ కొథియాల్ ఈ విమానాన్ని విజయవంతంగా నడిపి చరిత్ర సృష్టించారు. 1983లో పాత విమానాల స్థానంలో కొత్తవి తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఎల్సీఏ ప్రాజెక్ట్.. నేడు అత్యాధునిక తేజస్ ఎంకే-1ఏ స్థాయికి ఎదిగింది.
ఈ ప్రస్థానంలో తేజస్ ఎన్నో కీలక మైలురాళ్లను అధిగమించింది. 2025 చివర్లో రూ. 62,370 కోట్ల విలువైన మరో 97 తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమానాల తయారీకి హెచ్ఏఎల్ ఆర్డర్ దక్కించుకోవడం విశేషం. ఇప్పటికే ఉన్న 83 జెట్ల ఆర్డర్లకు ఇది అదనం. ఇక ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో భాగంగా, హైదరాబాద్‌కు చెందిన వెమ్ టెక్నాలజీస్ తయారు చేసిన సెంటర్ ఫ్యూజ్‌లేజ్ (విమాన మధ్య భాగం)ను 2025 మే నెలలో హెచ్ఏఎల్‌కు అప్పగించారు.
సాంకేతికపరంగా కూడా తేజస్ తన సత్తా చాటుతోంది. 2025 మార్చిలో తేజస్ నుంచి స్వదేశీ అస్త్ర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. అదే నెలలో పైలట్లకు ప్రాణవాయువు అందించే స్వదేశీ ఆక్సిజన్ సిస్టమ్ (OBOGS)ను 50 వేల అడుగుల ఎత్తులో విజయవంతంగా పరీక్షించారు. పాతికేళ్ల ఈ ప్రయాణం భారత రక్షణ రంగాన్ని స్వయం సమృద్ధం దిశగా నడిపిస్తోంది.