Nainesh Pachigar: ఈ ఏడాది కూడా బంగారం, వెండికి తిరుగులేదు... భారీగా పెరగనున్న ధరలు!

Gold and Silver Prices to Surge in 2026 Predicts Nainesh Pachigar
  • 2025లో భారీ లాభాలిచ్చిన బంగారం, వెండి
  • 2026లోనూ ఈ జోరు కొనసాగుతుందని నిపుణుల అంచనా
  • బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్లకు చేరే అవకాశం
  • వెండి ధర ఔన్సుకు 85 డాలర్లకు పెరిగే సూచనలు
  • సహజ వజ్రాల కన్నా కృత్రిమ వజ్రాలకు పెరుగుతున్న డిమాండ్
గత సంవత్సరం 2025లో బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టిన వారికి కాసుల వర్షం కురిసింది. బంగారం సుమారు 65 శాతం లాభాలను అందించగా, వెండి ఏకంగా 140 శాతానికి పైగా లాభాలను ఇచ్చి చరిత్రాత్మకంగా నిలిచింది. ఇదే సానుకూల ధోరణి 2026లోనూ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) గుజరాత్ అధ్యక్షుడు నైనేష్ పచ్చిగర్, ఐఏఎన్ఎస్‌తో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా బంగారం, వెండి జోరు కొనసాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

బంగారం ధరల భవిష్యత్తుపై వివరిస్తూ, "ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు 4,300 డాలర్ల వద్ద ఉంది. ఇది 5,000 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉంది" అని పచ్చిగర్ పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రస్తుత ధరల నుంచి 16 శాతానికి పైగా పెరిగే ఆస్కారం ఉందని ఆయన తెలిపారు. వెండికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయని, దాని ధర ప్రస్తుతమున్న 70 డాలర్ల నుంచి 85 డాలర్లకు పెరగవచ్చని అంచనా వేశారు. అంటే వెండిలో దాదాపు 20 శాతం అదనపు లాభాలకు వీలుందని సూచించారు.

మరోవైపు వజ్రాల మార్కెట్ గురించి మాట్లాడుతూ, తక్కువ ధరల కారణంగా సహజ వజ్రాల కంటే ల్యాబ్-గ్రోన్ డైమండ్స్‌కు (కృత్రిమ వజ్రాలకు) ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు. రాబోయే కొన్నేళ్లపాటు ఇదే ధోరణి కొనసాగవచ్చని, అయితే మూడు, నాలుగేళ్ల తర్వాత సహజ వజ్రాలకు తిరిగి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

ప్రపంచవ్యాప్త అనిశ్చితి, అమెరికా టారిఫ్ ఆందోళనలు, ప్రధాన దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలే 2025లో బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్ కూడా మధ్యలో ధరల స్థిరీకరణ ఉన్నప్పటికీ ఈ రెండు లోహాల బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేసింది.
Nainesh Pachigar
Gold price forecast
Silver price forecast
IBJA Gujarat
India Bullion and Jewellers Association
Commodity market
Investment tips
Lab grown diamonds
Natural diamonds
Market trends 2026

More Telugu News