Online Fraud: ఆన్‌లైన్ మోసాల ఉచ్చు... ఆరేళ్లలో భారతీయులు ఎంత కోల్పోయారో తెలుసా?

Online Fraud in India Indians Lost Over Rs 52976 Crore in Six Years
  • ఆరేళ్లలో రూ. 53 వేల కోట్లు స్వాహా
  • సైబర్ మోసాల్లో చిక్కిన భారతీయులు
  • ఒక్క 2025లోనే రూ. 19,813 కోట్ల మేర నష్టం 
  • అత్యధికంగా మహారాష్ట్ర.. టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ 
  • ఇన్వెస్ట్‌మెంట్ స్కీముల పేరుతోనే 77 శాతం మేర మోసాలు
దేశంలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. గత ఆరేళ్లలో వివిధ రకాల మోసాల బారిన పడి భారతీయులు ఏకంగా రూ.52,976 కోట్లకు పైగా నష్టపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నివేదిక ప్రకారం, ఒక్క 2025లోనే దేశవ్యాప్తంగా రూ.19,813 కోట్ల నష్టం వాటిల్లగా, 21.77 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి.

గతేడాది అత్యధికంగా నష్టపోయిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (రూ.3,203 కోట్లు) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (రూ.2,413 కోట్లు), తమిళనాడు (రూ.1,897 కోట్లు), ఉత్తరప్రదేశ్ (రూ.1,443 కోట్లు) నిలిచాయి. ఈ జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో రూ.1,372 కోట్ల నష్టంతో పాటు 95,000 ఫిర్యాదులు నమోదయ్యాయి.

ఈ మోసాల్లో సింహభాగం పెట్టుబడుల పథకాల పేరుతోనే జరుగుతోంది. మొత్తం నష్టంలో 77 శాతం ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ల వల్లేనని డేటా స్పష్టం చేస్తోంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో 8 శాతం, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ద్వారా 7 శాతం, సెక్స్‌టార్షన్ ద్వారా 4 శాతం చొప్పున ప్రజలు డబ్బు కోల్పోయారు. వేగవంతమైన డిజిటలైజేషన్, పెరిగిన ఆన్‌లైన్ లావాదేవీలను ఆసరాగా చేసుకొని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. 2025లో నమోదైన ఫిర్యాదుల్లో 45 శాతం కాంబోడియా, మయన్మార్, లావోస్ వంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.

సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆర్థిక మోసాల బారిన పడిన వెంటనే బాధితులు 1930 అనే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Online Fraud
Cyber Crime
I4C
Indian Cyber Crime Coordination Center
Digital Arrest
Investment Schemes
Cyber Crime Report India
Telangana Cyber Crime

More Telugu News