Auto Drivers: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ.. అసెంబ్లీ ముట్టడికి ఆటో డ్రైవర్ల పిలుపు
- ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటున్న ఆటో డ్రైవర్లు
- ఉచిత బస్సు పథకం కారణంగా తమ ఉపాధి దెబ్బతిందని ఆవేదన
- రూ. 11 వేలు ఇస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదంటున్న ఆటో డ్రైవర్లు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు అనేక భరోసాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని ఆటో యూనియన్ నాయకులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు ఆటో యూనియన్ కార్మికులు పిలుపునిచ్చారు.
ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం కారణంగా తమ ఉపాధి పూర్తిగా దెబ్బతిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. రోజువారీగా వచ్చే ప్రయాణికులు గణనీయంగా తగ్గిపోయారని, కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రతి ఏడాది ఆటో డ్రైవర్లకు రూ. 11,000 ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, రెండేళ్లు గడిచినా ఒక్క రూపాయి కూడా అందలేదని ఆరోపించారు. హామీలు చాలానే ఇచ్చినా, వాటిని అమలు చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆటో డ్రైవర్లు విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఆటో యూనియన్ ముట్టడి పిలుపుతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో ఆందోళనలు చేయవద్దని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.