Saudi Arabia: అట్టుడుకుతున్న పశ్చిమాసియా... రెండు గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తత
- ఇప్పటికే ఇజ్రాయెల్, గాజా, ఇరాన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
- తాజాగా యెమెన్ కేంద్రంగా సౌదీ, యూఏఈ మధ్య ఉద్రిక్తత
- యూఏఈ మద్దతిస్తున్న దళాలపై సౌదీ దాడులు
ఇప్పటికే గాజా–ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఆ ఉద్రిక్తతలు కాస్త తగ్గుతున్నాయనుకున్న సమయంలోనే కొత్త సంవత్సరంలో మరోసారి మధ్యప్రాచ్యం వేడెక్కుతోంది. ఈసారి రెండు శక్తిమంతమైన గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలు ఒక వైపు ఉండగా, మరోవైపు యెమెన్ అంశం గల్ఫ్ దేశాల మధ్య చిచ్చు పెట్టింది.
ప్రస్తుతం యెమెన్‌లో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో పోరాటం కొనసాగుతోంది. ఈ రెండు వర్గాలకు వేర్వేరు గల్ఫ్ దేశాలు మద్దతు ఇవ్వడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. యెమెన్ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ (ఐఆర్‌జీ)కి సౌదీ అరేబియా మద్దతు ఇస్తుండగా, సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (ఎస్టీసీ)కి యూఏఈ అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో యూఏఈ మద్దతుగల దళాలపై సౌదీ అరేబియా దాడులు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ముదిరింది. ఈ దాడుల్లో ఎస్టీసీకి చెందిన పలువురు యోధులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
యెమెన్‌లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలను ప్రస్తుతం ఐఆర్‌జీ పరిపాలిస్తోంది. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఎస్టీసీ స్వతంత్ర దక్షిణ యెమెన్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతోంది. డిసెంబరు నెల నుంచి ఎస్టీసీ కీలక ప్రాంతాలను ఆక్రమించడం ప్రారంభించింది. ముఖ్యంగా హద్రామావత్, అల్-మరాహ్ వంటి ఇంధన వనరులు ఉన్న ప్రాంతాలను తన అధీనంలోకి తీసుకోవడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
యెమెన్ సమైక్యంగా ఉండాలన్నది సౌదీ అరేబియా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఎస్టీసీ స్వతంత్ర ప్రాంతం కోసం చేస్తున్న ప్రయత్నాలు సౌదీకి అంగీకారంగా లేవు. ఈ నేపథ్యంలోనే యూఏఈ మద్దతుతో ముందుకు వెళ్తున్న ఎస్టీసీపై సౌదీ అరేబియా సైనిక చర్యలకు దిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగకపోయినా, ప్రతినిధి బలగాల ద్వారా ఒకరిపై ఒకరు ప్రభావం చూపే ప్రయత్నం చేస్తున్నాయి.
మొత్తంగా చూస్తే, యెమెన్ సంక్షోభం ఇప్పుడు సౌదీ అరేబియా–యూఏఈ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గాజా యుద్ధం తర్వాత కాస్త శాంతిగా ఉందనుకున్న పశ్చిమాసియా, ఈ తాజా పరిణామాలతో మళ్లీ అగ్నిగుండంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.