Savitribai Phule: సావిత్రి బాయి పూలే జయంతి ..చంద్రబాబు, లోకేశ్ నివాళి

Chandrababu Naidu Pays Tribute to Savitribai Phule on Jayanti
  • సావిత్రిబాయి చూపిన దారిలోనే నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారన్న ఏపీ సీఎం చంద్రబాబు 
  • పురుషులకన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసుకునే స్థాయికి మహిళలను తీసుకువచ్చారన్న చంద్రబాబు
  •  సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి అన్న లోకేశ్
దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఘన నివాళి అర్పించారు. మహిళలను విద్యావంతులుగా చేయాలనే లక్ష్యంతో ఆనాడు సమాజ కట్టుబాట్లను ధిక్కరించి ఆమె చేసిన సాహసం నేటి ఆధునిక మహిళా శక్తికి బలమైన పునాదిగా నిలిచిందని పేర్కొన్నారు.
 
సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం మహిళల విద్యకే పరిమితం కాకుండా, పురుషులకన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసుకునే స్థాయికి మహిళలను తీసుకొచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఆమె చూపిన దారిలోనే నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు.
 
సమాజంలో సగభాగమైన మహిళల విద్యాభివృద్ధిలో సావిత్రిబాయి పూలే కీలక పాత్ర పోషించారని సీఎం గుర్తు చేశారు. అందుకే ఆధునిక మహిళలు ఆమెకు సదా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా విద్యకు వెలుగులు నింపిన సావిత్రిబాయి పూలేకు మరోసారి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్‌లో తెలిపారు.

దేశ మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే .. లోకేశ్

సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నానని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే మన దేశ మొట్టమొదటి మహిళా టీచర్ అని, స్త్రీ విద్య, హక్కుల సాధన కోసం జీవితాంతం కృషిచేశారని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తిని సమాజ మార్పునకు శక్తిమంతమైన సాధనంగా భావించారన్నారు. సామాజిక వ్యతిరేకత, అవమానాలు ఎదురైనా బాలికల విద్య కోసం ధైర్యంగా ముందుకు సాగారని,  నేటి మహిళా ఉపాధ్యాయులకు ఆమె మార్గదర్శి అనీ అన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆమెకు మనం అర్పించే నిజమైన నివాళి అని లోకేశ్ పేర్కొన్నారు.
Savitribai Phule
Chandrababu Naidu
Nara Lokesh
Women Education
Social Reformer
First Female Teacher India
Andhra Pradesh
Women Empowerment
Education
Indian History

More Telugu News