Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి హైకోర్టులో తాత్కాలిక ఊరట
- అరెస్ట్ చేయవద్దంటూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు
- వంశీతో పాటు మరో 8 మందిపై కేసు నమోదు
- ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న వంశీ
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. బెజవాడ మాచవరం పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వంశీని అరెస్టు చేయవద్దంటూ కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్‌కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
కేసు వివరాల్లోకి వెళితే... నూతక్కి సునీల్ అనే వ్యక్తి ఈ నెల 17న మాచవరం పోలీస్ స్టేషన్‌లో వంశీపై ఫిర్యాదు చేశాడు. వల్లభనేని వంశీ అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని, తనను హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వంశీతో పాటు మరో ఎనిమిది మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కేసు నమోదైన విషయం బయటకు రావడంతో వంశీ ఒక్కసారిగా అందుబాటులో లేకుండా పోయారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతరులు కూడా కనిపించకపోవడంతో, వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కొన్ని బృందాలు హైదరాబాద్ కేంద్రంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో వంశీ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరణతో కూడినదని, తప్పుడు ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేశారని వంశీ తన వాదనలో పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, ప్రస్తుతం వంశీని అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.