Shah Rukh Khan: ఐపీఎల్ లో బంగ్లాదేశ్ ఆటగాడు... బీజేపీ, కాంగ్రెస్ మాటల తూటాలు

Shah Rukh Khan IPL Controversy Sparks Political Debate
  • కేకేఆర్ జట్టులోకి బంగ్లాదేశ్ ప్లేయర్‌ ముస్తాఫిజూర్ రెహ్మాన్ ను తీసుకోవడంపై వివాదం
  • షారూఖ్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్న ప్రవచనకర్త దేవకీనందన్
  • షారూఖ్ మతాన్ని చూసే లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీపై విపక్షాల ఫైర్
  • పాక్‌తో మ్యాచ్ ఆడినప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తోందని నిలదీత
  • ఇది షారూఖ్ ఉద్దేశపూర్వకంగా చేసిన పనేనన్న బీజేపీ ఎంపీ
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ‘కోల్‌కతా నైట్ రైడర్స్’ (కేకేఆర్) ఒక బంగ్లాదేశ్ క్రికెటర్‌ (ముస్తాఫిజూర్ రెహ్మాన్) ను కొనుగోలు చేయడం పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రముఖ ప్రవచనకర్త దేవకీనందన్ ఠాకూర్ ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. షారూఖ్ ఖాన్ పేరు, మతాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డాయి.

ఈ వివాదంపై కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే స్పందిస్తూ, "అసలు బంగ్లాదేశ్ ఆటగాడిని ఐపీఎల్‌లో ఆడేందుకు ఎందుకు అనుమతించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఈ విషయంలో హోంమంత్రి అమిత్ షా, బీసీసీఐ కార్యదర్శి జై షాలను ఎందుకు ప్రశ్నించడం లేదు?" అని నిలదీశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల విషయంలో కేంద్రం ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు.

మరో కాంగ్రెస్ నేత రాకేశ్ సిన్హా మాట్లాడుతూ, "కేవలం షారూఖ్ ఖాన్ అనే పేరు ఉండటం వల్లే దేవకీనందన్ ఠాకూర్, బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన వెంటనే భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. అప్పుడు ఈ ప్రవచననకర్తలు ఎక్కడున్నారు?" అని ప్రశ్నించారు. పాలకపక్షం ప్రోద్బలంతోనే ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ఎన్సీపీ (ఎస్పీ), సీపీఐ(ఎం), సమాజ్‌వాదీ పార్టీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. క్రీడల్లోకి మతాన్ని, రాజకీయాలను తీసుకురావడం అనాగరికమని, కేవలం షారూఖ్ కాబట్టే ఈ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

ఈ విమర్శలపై బీజేపీ స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షా దేవ్ మాట్లాడుతూ, క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టకూడదని, కానీ దేశ ప్రయోజనాల విషయంలో భావోద్వేగాలు సహజమని అన్నారు. అయితే, మరో బీజేపీ ఎంపీ యోగేంద్ర చందోలియా మాత్రం, షారూఖ్ ఖాన్ ఉద్దేశపూర్వకంగానే వివాదాన్ని రెచ్చగొట్టేందుకు బంగ్లాదేశ్ ఆటగాడిని తీసుకున్నారని, ఆ కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 
Shah Rukh Khan
IPL
Mustafizur Rahman
Bangladesh cricketer
KKR
Devakinandan Thakur
BJP
Congress
Hindu attacks Bangladesh
Supriya Shrinate

More Telugu News