Jogi Ramesh: జోగి రమేశ్ కు మళ్లీ కస్టడీ... భార్య, కుమారుడికి నోటీసులు

Jogi Ramesh Remand Extended
  • జోగి రమేశ్ కు బిగుస్తున్న కేసుల ఉచ్చు
  • జోగి సోదరులను మరోసారి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
  • విజయవాడ జిల్లా జైలుతో ఉన్న జోగి

నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కు సంబంధించిన దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న జోగి రమేశ్, ఆయన సోదరుడు రాములు‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మరోసారి కస్టడీలోకి తీసుకుంది. శుక్రవారం ఉదయం వారిద్దరినీ అధికారికంగా కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు, మూడు రోజుల పాటు లోతైన విచారణ చేపట్టనున్నారు.


ఇబ్రహీంపట్నం ప్రాంతంలో నకిలీ మద్యం తయారీ, సరఫరాకు సంబంధించిన కేసులో ఇప్పటికే జోగి బ్రదర్స్‌ను సిట్ అధికారులు ఒకసారి ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి విచారణలో వెలుగులోకి రాని కీలక అంశాలు, మరికొందరు వ్యక్తులతో ఉన్న సంబంధాలు, నిధుల లావాదేవీలపై స్పష్టత కోసం రెండోసారి కస్టడీ అవసరమని అధికారులు భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జోగి రమేశ్, రాములు ఇద్దరూ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.


ఈ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జోగి కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జోగి రమేశ్ అరెస్టు సమయంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లిన సందర్భంలో అక్కడ జరిగిన ఘటనలపై నమోదు చేసిన కేసులో భాగంగా, ఆయన భార్యతో పాటు కుమారుడికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు అందజేశారు. ఆసుపత్రిలో అద్దాలు ధ్వంసం చేయడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదు అయ్యింది.


మరోవైపు, నకిలీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల రిమాండ్ వ్యవధి కూడా పొడిగించారు. ఈరోజు రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను విజయవాడ జిల్లా జైలు నుంచి కోర్టుకు తరలించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 16వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం నిందితులను తిరిగి జిల్లా జైలుకు తరలించారు.

Jogi Ramesh
Jogi Ramesh fake liquor case
fake liquor case Andhra Pradesh
Ibrahimpatnam fake liquor
AP SIT investigation
Vijayawada government hospital incident
Jogi Ramesh arrest
Andhra Pradesh politics

More Telugu News