Telangana: తెలంగాణలో మహిళలకు 'కామన్ మొబిలిటీ కార్డు'.. ఇక ఆధార్ అవసరం లేదు

Telangana Women Get Common Mobility Card No Aadhaar Needed
  • మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల జారీ
  • ఒకే కార్డుతో బస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ సేవలు
  • ప్రయాణికుల డేటాతో ఆర్టీసీ రూట్ల క్రమబద్ధీకరణ
  • భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు అనుసంధానం
తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'మహాలక్ష్మి' పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళల కోసం ప్రత్యేకంగా 'కామన్ మొబిలిటీ కార్డు' (CMC)లను జారీ చేయనుంది. ప్రస్తుతం ఆధార్ కార్డుతో ప్రయాణిస్తున్న సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ స్మార్ట్ కార్డుల విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని రూపకల్పన కోసం ప్రభుత్వం ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)తో ఒప్పందం చేసుకుంది.

గతేడాది ప్రారంభమైన మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు సుమారు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. దీనికోసం ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 8,500 కోట్లు చెల్లించింది. అయితే, ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు చూపించడం వల్ల కండక్టర్లు, ప్రయాణికుల మధ్య తరచూ ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఆధార్‌పై ఫొటోలు స్పష్టంగా లేకపోవడం, నకిలీ కార్డుల వినియోగం వంటి సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది.

ఈ స్మార్ట్ కార్డు కేవలం బస్ పాస్ మాత్రమే కాదు, బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడనుంది. మహిళలు బస్సుల్లో ఈ కార్డును ట్యాప్ చేసి ఉచితంగా ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ఇందులో డబ్బులు లోడ్ చేసుకుని మెట్రో రైలు, ఎంఎంటీఎస్ వంటి ఇతర రవాణా సేవలను కూడా వినియోగించుకోవచ్చు. దీనివల్ల ప్రయాణికులు ప్రతిసారీ ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

ఈ కార్డుల జారీతో ప్రభుత్వానికి ప్రయాణికుల డేటా కచ్చితంగా అందుబాటులోకి వస్తుంది. ఏయే మార్గాల్లో మహిళల రద్దీ ఎక్కువగా ఉందో గుర్తించి, దానికి అనుగుణంగా బస్సు సర్వీసులను సర్దుబాటు చేసే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఆర్టీసీకి నష్టాలు తగ్గడమే కాకుండా, రవాణా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. భవిష్యత్తులో రేషన్, ఆరోగ్య సేవలు, ఇతర ప్రభుత్వ పథకాలను కూడా ఇదే కార్డుకు అనుసంధానించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా మహిళలతో ప్రారంభించి, దశలవారీగా రాష్ట్ర ప్రజలందరికీ ఈ కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
Telangana
Common Mobility Card
Revanth Reddy
Telangana
Maha Lakshmi Scheme
Free Bus Travel
CGG
RTC
Bus Pass
Metro Rail
MMTS

More Telugu News