Meena: మీనా కూతురు నైనిక ఫొటో వైరల్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీనా, నైనిక ఫొటో
- ఎవరో ఎడిట్ చేసి షేర్ చేసిన వైనం
- కూతురుని సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతున్న మీనా
సీనియర్ నటి మీనా తన వ్యక్తిగత జీవితం విషయంలో, ముఖ్యంగా తన కూతురు నైనిక ప్రైవసీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా ‘తేరి’ (తెలుగులో పోలీసోడు) సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నైనిక, ఆ తర్వాత వెండితెరపై చాలా అరుదుగా మాత్రమే కనిపించింది. తన కూతురు సాధారణ జీవితం గడపాలని, చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని మీనా తీసుకున్న నిర్ణయమే దీనికి కారణం.
ఇంతటి జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలో, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫొటో మీనా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. క్రిస్మస్ సందర్భంగా మీనా పక్కన నైనిక నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్న ఆ ఫొటో నెట్టింట విస్తృతంగా షేర్ అవుతోంది. దీంతో “ఇన్ని రోజులు బయటకు రానివ్వని నైనిక ఫొటో ఇప్పుడు ఎలా లీక్ అయ్యింది?” అనే సందేహాలు మొదలయ్యాయి.
నిశితంగా పరిశీలిస్తే, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటో ఒరిజినల్ కాదని, అది పూర్తిగా ఎడిట్ చేసిన ఫేక్ పిక్ అని స్పష్టమవుతోంది. మీనా విడిగా దిగిన ఒక తాజా ఫొటోను, నైనికకు సంబంధించిన పాత ఫొటోతో కలిపి ఎవరో కావాలని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి హెయిర్ స్టైల్, లైటింగ్, ఫొటో క్వాలిటీ తేడాగా ఉండటం వల్ల ఇది ఫేక్ అన్న విషయం ఇట్టే అర్థమవుతోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఆ ఫొటోను షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నైనికదని చెప్పుకుంటున్నా, అది నిజమైన అకౌంటా? ఫేక్ అకౌంటా? అన్న దానిపై కూడా స్పష్టత లేదు.
మీనా స్వయంగా బాలనటిగా కెరీర్ ప్రారంభించిన వ్యక్తి. షూటింగ్‌లు, సినిమా వాతావరణం కారణంగా తన బాల్యాన్ని, చదువును పూర్తిగా ఆస్వాదించలేకపోయానని ఆమె పలుమార్లు చెప్పుకొచ్చారు. అదే పరిస్థితి తన కూతురికి రాకూడదనే గట్టి నిర్ణయంతోనే నైనికను మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతున్నారు.
నైనిక పుట్టినరోజులకైనా, ప్రత్యేక సందర్భాల్లోనైనా మీనా షేర్ చేసే ఫొటోలు అన్నీ పాతవే తప్ప, తాజా ఫోటోలు ఎప్పుడూ బయటపెట్టలేదు. ఇటీవల ఒక పెళ్లి వేడుకలో తీసిన గ్రూప్ ఫోటోలో మాత్రమే నైనిక కనిపించింది కానీ, సోలో ఫోటోలు మాత్రం ఎక్కడా విడుదల కాలేదు.