China Pakistan military alliance: భారత్‌కు ముప్పుగా చైనా-పాక్ 'మిలిటరీ బంధం'.. అమెరికా రక్షణ శాఖ నివేదికలో సంచలన విషయాలు!

China Pakistan Military Alliance a Threat to India Pentagon Report
  • ఒకవైపు సరిహద్దుల్లో శాంతి మంత్రం జపిస్తున్న చైనా
  • మరోవైపు పాకిస్థాన్‌కు భారీగా ఆయుధ సంపత్తి సరఫరా
  • చైనా-పాక్ సైనిక భాగస్వామ్యం అమెరికా తాజా నివేదిక
  • చైనా తీరుతో భారత్‌కు ముప్పు ఉందని ఆందోళన
దక్షిణ ఆసియాలో చైనా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. భారత్‌తో సరిహద్దు వివాదాలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు పాకిస్థాన్‌తో కలిసి భారత్ భద్రతను ప్రభావితం చేస్తోందని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తన తాజా నివేదికలో హెచ్చరించింది. కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్)కు సమర్పించిన ఈ వార్షిక నివేదికలో చైనా-పాక్ సైనిక భాగస్వామ్యం గురించి కీలక విషయాలను వెల్లడించింది.

చైనాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక భాగస్వాములలో పాకిస్థాన్ అత్యంత స్థిరమైన, ముఖ్యమైన భాగస్వామి అని నివేదిక పేర్కొంది. ఆయుధాల విక్రయం, ఉమ్మడి ఉత్పత్తి, సైనిక శిక్షణలో చైనా, పాక్ మధ్య సహకారం నిరంతరం పెరుగుతోంది. పాకిస్థాన్ సైనిక ఆధునికీకరణలో చైనా పరికరాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. గగనతల, భూతల, నావికా రంగాల్లో అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను చైనా పాక్‌కు బదిలీ చేస్తోందని నివేదిక వివరించింది.

చైనా-పాక్ సంబంధాల వల్ల భారత్‌కు రెండు వైపుల నుంచి (ఉత్తర, పశ్చిమ సరిహద్దులు) ఒత్తిడి పెరుగుతోందని పెంటగాన్ విశ్లేషించింది. ఏదైనా సంక్షోభం తలెత్తినప్పుడు భారత్ తన రెండు సరిహద్దులను ఏకకాలంలో కాపాడుకోవాల్సిన సవాలు ఎదురవుతుందని హెచ్చరించింది. అక్టోబర్ 2024లో ఎల్‌ఏసీ (వాస్తవాధీన రేఖ) వెంబడి బలగాల ఉపసంహరణకు చైనా అంగీకరించినప్పటికీ, ఇరు దేశాల మధ్య అపనమ్మకం అలాగే ఉందని నివేదిక స్పష్టం చేసింది. భారత్-అమెరికా బంధం మరింత బలపడకుండా అడ్డుకోవడానికే చైనా సరిహద్దుల్లో శాంతి చర్చలకు మొగ్గు చూపుతోందని అమెరికా భావిస్తోంది.

కేవలం భూభాగంపైనే కాకుండా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో కూడా చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. పాకిస్థాన్ తీర ప్రాంతాలకు సమీపంలో చైనా తన సైనిక కార్యకలాపాలకు అవసరమైన సౌకర్యాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని, ఇది భారత నావికా దళ భద్రతకు కొత్త సవాళ్లను విసురుతుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా తన ‘కోర్ ఇంటరెస్ట్’గా చెప్పుకుంటూ భూభాగ వాదనలను వినిపించడం పరిస్థితిని మరింత సున్నితంగా మార్చుతోందని నివేదిక పేర్కొంది. 
China Pakistan military alliance
India security threat
Pentagon report
Sino Pak relations
India China border
US Defence report
Military cooperation
LAC standoff
Indian Navy
South Asia geopolitics

More Telugu News