Vignesh Puthur: ఒకే మ్యాచ్‌లో 6 క్యాచ్‌లు.. జాంటీ రోడ్స్ రికార్డు బద్దలుకొట్టిన కేరళ కుర్రాడు!

Vignesh Puthur Breaks Jonty Rhodes Record with 6 Catches in a Match
  • విజయ్ హజారే ట్రోఫీలో కేరళ ఆటగాడి ప్రపంచ రికార్డు
  • ఒకే మ్యాచ్‌లో 6 క్యాచ్‌లు పట్టిన తొలి క్రికెటర్‌గా విఘ్నేశ్ పుతుర్ 
  • ద‌క్షిణాఫ్రికా మాజీ ప్లేయ‌ర్‌ జాంటీ రోడ్స్ రికార్డు బ్రేక్
  • ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఎంపికైన కొన్ని రోజులకే ఈ ఘనత
  • లిస్ట్-ఏ అరంగేట్ర మ్యాచ్‌లోనే అరుదైన రికార్డు నమోదు
కేరళ యువ క్రికెటర్ విఘ్నేశ్ పుతుర్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఆరు క్యాచ్‌లు పట్టిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అహ్మదాబాద్ వేదికగా విజయ్ హజారే ట్రోఫీ 2025లో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో విఘ్నేశ్ ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు. కాగా, ఇది అతనికి లిస్ట్-ఏ ఫార్మాట్‌లో అరంగేట్ర మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ మ్యాచ్‌లో విఘ్నేశ్.. త్రిపుర బ్యాటర్లు ఉదియన్ బోస్, శ్రీదామ్ పాల్, స్వప్నిల్ సింగ్, సౌరభ్ దాస్, అభిజిత్ సర్కార్, విక్కీ సాహాలను క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్‌తో పాటు బ్రాడ్ యంగ్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, హ్యారీ బ్రూక్ వంటి ఆటగాళ్ల పేరిట ఉండేది. వారంతా ఒకే మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు అందుకున్నారు. ఇప్పుడు ఆ రికార్డును విఘ్నేశ్ బద్దలుకొట్టాడు.

ఇక‌, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో విఘ్నేశ్‌ను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. గత సీజన్‌లో (2025) ముంబై ఇండియన్స్‌ తరఫున 5 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీసిన అతను, గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ముంబై అతన్ని విడుదల చేయగా, వేలంలో రాజస్థాన్ జట్టులోకి వచ్చాడు. కొత్త ఫ్రాంచైజీకి ఎంపికైన కొన్ని రోజులకే ఇలా ప్రపంచ రికార్డు నెలకొల్పడం విశేషం.
Vignesh Puthur
Kerala cricketer
Vijay Hazare Trophy
List A cricket
catches record
Jonty Rhodes record
Rajasthan Royals
IPL 2026
Tripura
cricket

More Telugu News