Azam Jah: నిజాం వారసుల మధ్య ముదిరిన పోరు.. ప్రిన్స్ ఆజం జాకు ఉద్వాసన నోటీసు!

Azam Jah ousted from Mukarram Jah Trust sparks Nizam heirs feud
  • తన తండ్రి ఆస్తుల్లో వాటా కోరుతూ ఆజం జా న్యాయపోరాటం
  • ట్రస్ట్ నుంచి ఆయనను తప్పించేందుకు ప్రిన్సెస్ ఎస్రా వర్గం యత్నాలు?
  • ముకర్రమ్ జా విల్లు రాయకపోవడంతో
  • కుటుంబ సభ్యుల మధ్య ముదురుతున్న పోరు
హైదరాబాద్ చివరి నిజాం వారసుల మధ్య ఆస్తులు, అధికారిక హోదాల కోసం జరుగుతున్న అంతర్గత పోరు రచ్చకెక్కింది. దివంగత ఎనిమిదో నిజాం ప్రిన్స్ ముకర్రమ్ జా స్థాపించిన 'ముకర్రమ్ జా ట్రస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్' (MJTEL) నుంచి ఆయన రెండో కుమారుడు ప్రిన్స్ ఆజం జాను తొలగిస్తూ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

తన తండ్రి స్వయంగా తనను ఈ ట్రస్ట్‌లో సభ్యుడిగా నియమించారని, పారదర్శకతను అణచివేసేందుకే ప్రిన్సెస్ ఎస్రా వర్గం తనను బయటకు పంపేందుకు ప్రయత్నిస్తోందని ఆజం జా ఆరోపించారు. ఈ నోటీసును ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా పంపారని ఆయన కార్యాలయం పేర్కొంది. డిసెంబర్ 6వ తేదీతో ఉన్న నోటీసును, డిసెంబర్ 23న అందజేశారని, దీనివల్ల సమాధానం ఇచ్చేందుకు కూడా సమయం లేకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

2023 జనవరిలో ముకర్రం జా మరణించిన తర్వాత ఆయన మొదటి భార్య ఎస్రా కుమారుడు అజ్మెత్ జాను 'తొమ్మిదో నిజాం'గా ప్రకటించారు. అయితే, 1971లోనే అధికారిక బిరుదులు రద్దయినప్పుడు తన సోదరుడిని 'నిజాం'గా ఎలా ప్రకటిస్తారని ఆజం జా గతేడాది కోర్టుకెక్కారు. ముకర్రం జా ఎలాంటి 'విల్లు' (వీలునామా) రాయకపోవడంతో ఆస్తుల పంపకంపై వివాదం నెలకొంది. తన తండ్రికి చెందిన ప్యాలెస్‌లలోకి కూడా తనను ఎస్రా అనుమతించడం లేదని ఆజం జా గతంలోనే ఆరోపించారు.

ముకర్రం జాకు ఐదుగురు భార్యలు కాగా, వారసుల మధ్య ఆస్తుల కోసం పోటీ నెలకొంది. ఒకవైపు ఎస్రా కుమారుడు అజ్మెత్ జా, మరోవైపు హెలెన్ ఆయేషా కుమారుడు ఆజం జా మధ్య పోరు నడుస్తుండగా.. ఆరో నిజాం వారసుడనని చెప్పుకుంటూ రౌనక్ యార్ ఖాన్ కూడా రంగంలోకి దిగారు. ముకర్రం జా తన చివరి రోజుల్లో టర్కీలో ఒక సాధారణ ఇంట్లో గడిపారని, ఆయన ఆస్తుల నిర్వహణ అంతా ఎస్రా చేతిలోనే ఉందని సమాచారం. ఈ తాజా నోటీసుతో నిజాం కుటుంబంలో కలకలం మరింత రేగింది.
Azam Jah
Mukarram Jah Trust
Nizam heirs dispute
Princess Esra
Nizam properties
Hyderabad Nizam
Azmet Jah
Rounaq Yar Khan
Nizam family feud
Succession crisis

More Telugu News