Balamurugan: విడాకుల నోటీసు పంపిన భార్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Software Engineer Balamurugan Murders Wife Over Divorce Dispute
  • కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం
  • 2011లో ప్రేమ వివాహం చేసుకున్న భార్య
  • భార్యపై అనుమానం పెంచుకోవడంతో మనస్పర్థలు
  • పిల్లలతో కలిసి భర్తకు దూరంగా జీవిస్తున్న భార్య
  • భార్యను కాల్చి చంపి పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
తనతో విడిపోయి దూరంగా ఉంటున్న భార్య విడాకుల నోటీసు పంపడంతో తట్టుకోలేకపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆమెను కాల్చి చంపాడు. ఆపై పోలీసులకు లొంగిపోయాడు. ఐటీహబ్ బెంగళూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు బాలమురుగన్ (40), భువనేశ్వరి (39) 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బాలమురుగన్ గతంలో ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమినిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. భువనేశ్వరి యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై బాలమురుగన్ అనుమానం పెంచుకోవడంతో వారి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏడాదిన్నర కాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.

భర్త వేధింపులు తట్టుకోలేక ఆరు నెలల క్రితం భువనేశ్వరి తన పిల్లలతో కలిసి వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఇల్లు తీసుకుని రహస్యంగా ఉంటోంది. అయితే, భార్యపై కక్ష పెంచుకున్న బాలమురుగన్ ఆమె ఎక్కడ ఉందో ఆరా తీసి, నాలుగు నెలల క్రితమే ఆమె నివసించే ప్రాంతానికి సమీపంలోనే అద్దెకు దిగాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం భార్య నుంచి విడాకుల నోటీసు అందడంతో బాలమురుగన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో భువనేశ్వరి బ్యాంక్ పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, ఆమె కోసం అప్పటికే మాటు వేసిన బాలమురుగన్ తన వద్దనున్న పిస్టల్‌తో అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపాడు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో రక్తపు మడుగులో పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

హత్య అనంతరం నిందితుడు నేరుగా మగడి రోడ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యను తానే చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన అతడికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Balamurugan
Bhuvaneshwari
Bangalore crime
software engineer
divorce notice
murder case
infidelity
Capgemini
Union Bank
Whitefield

More Telugu News